= వర్షాలు, పంటలు, పాడి లేక.. బోర్లలో నీళ్లు రాక అప్పులపాలయ్యాం
= ఎకరా వేరుశనగకు రూ.15 వేలు ఖర్చు చేస్తే అర బస్తా కూడా రాలేదు
= వేరుశనగకు ఫసల్‌బీమా వర్తింపజేయాలి.. ఇన్పుట్, ఇన్సూరెన్సు విధానం మారాలి
= ఉపాధి పనిదినాలు పెంచాలి
= ఉద్యాన పంటల రక్షణ, శాశ్వత సాగునీటి చర్యలు చేపట్టాలి
= కేంద్ర కరువు బృందానికి రైతులు, పార్టీల నేతలు, ప్రజాసంఘాల వినతి
= తక్షణ సాయంగా రూ.2,161.38 కోట్లు ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి
అనంతపురం అగ్రికల్చర్ : ‘‘పంటలు పండలేదు. పెట్టిన పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. ఇంటినిండా అప్పులు మిగిలాయి. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ పోషణ భారంగా మారింది. బతుకుదామని బోర్లు వేయిస్తే 800 నుంచి వెయ్యి అడుగులు తవ్వినా చుక్క నీరు రావడం గగనమైంది. మల్బరీ, పండ్లతోటలు నిలువునా ఎండిపోతుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. పండినా మార్కెట్‌లో ధర లేక టమాట లాంటివి రోడ్లలో పారబోస్తున్న పరిస్థితి. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా మారాల్సిన దుస్థితి. తాగడానికి కూడా గుక్కెడు నీరు లభించడం కష్టంగా ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సాయం అందజేయకుంటే చావులే శరణ్యం’’ అంటూ జిల్లా రైతులు కేంద్ర కరువు బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాత్కాలిక ఉపశమనంతో పాటు హంద్రీ–నీవా లాంటి ప్రాజెక్టులతో తాగు, సాగునీటి కల్పన ద్వారా శాశ్వత కరువు నివారణ చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యుత్‌శాఖ డైరెక్టర్ జేకే రాథోడ్ నేతృత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సెక్రటరీ ఎం.రామకృష్ణ, తాగునీటి విభాగం సీనియర్ సలహాదారు జీఆర్ జర్గర్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం సోమవారం జిల్లాలో పర్యటించింది.
రూ.2,161.38 కోట్ల సాయం చేయండి
సోమవారం ఉదయం 9.40 గంటలకు కేంద్ర కరువు బృందం సభ్యులు హిందూపురం మండలం కిరికెర వద్దనున్న పట్టుపరిశోధన, అభివృద్ధి సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. కరువు పరిస్థితులపై వ్యవసాయ, పట్టు, పాడి, పశుసంవర్ధక, ఉద్యాన, భూగర్భజల, ఐసీడీఎస్, డ్వామా తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్ను తిలకించారు. అక్కడే కరువు పరిస్థితులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ను కలెక్టర్ కోన శశిధర్ కేంద్ర బృందానికి అర్థమయ్యేలా గణాంకాలతో సహా ఇచ్చారు. తక్షణసాయంగా జిల్లాకు రూ.2,161.38 కోట్లు అందజేయాలంటూ నివేదిక సమర్పించారు. 2017 జూన్ వరకు అంచనాతో ఈ నివేదికను తయారు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అందులో వ్యవసాయశాఖకు రూ.1,203.02 కోట్లు, ఉద్యానశాఖకు రూ.168.97 కోట్లు, పట్టు పరిశ్రమశాఖకు రూ.27 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.55.84 కోట్లు, తాగునీటి విభాగానికి రూ.47.94 కోట్లు, పబ్లిక్ హెల్త్‌కు రూ.21.99 కోట్లు, మైనర్ ఇరిగేషన్ కు రూ.207.75 కోట్లు, డ్వామాకు రూ.309.46 కోట్లు, ఐసీడీఎస్‌కు రూ.119.41 కోట్లు అవసరమని వివరించారు.
ఎండిన పంటల పరిశీలన
గంట పాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఉదయం 11.30 గంటలకు కరువు పరిశీలన కోసం బయలుదేరారు. మొదట హిందూపురం మునిసిపాలిటీ పరిధిలోని రహమత్‌నగర్‌లో తాగునీటి సమస్యను తెలుసుకున్నారు. స్థానికులు, పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీ మహిళలు దశాబ్దాలుగా తాగునీటి కోసం తాము పడుతున్న అవస్థలను వివరించారు. అక్కడి నుంచి హిందూపురం మండలం మణేసముద్రం గ్రామానికి వెళ్లి అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పరిగి మండలం గొల్లపల్లిలో హనుమంతరాయుడుకు చెందిన ఎండిన మల్బరీ తోట, రైతు వీరారెడ్డికి చెందిన ఎండిన కంది పంట పొలాలను పరిశీలించారు. రెండెకరాల పొలంలో 600 అడుగుల చొప్పున నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు రాకపోవడంతో అప్పులు మిగిలాయని రైతు వీరారెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెడితే ఒక బస్తా వేరుశనగ పండిందని రైతు నాగప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప జిల్లా కరువు పరిస్థితుల గురించి చెబుతూ తప్పనిసరిగా సాయం చేయాలని కోరారు. కరువు బృందాలు వచ్చివెళుతున్నా శాశ్వత పరిష్కారం చూపించలేదన్నారు. దేశమంతా ఒకేరకంగా కాకుండా ‘అనంత’ లాంటి జిల్లాలకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స పాలసీలు కూడా మార్పు చేయాలన్నారు. అక్కడి నుంచి గోరంట్ల మండలం మందలపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రైతులతో సమావేశమయ్యారు. 3.40 ఎకరాల వేరుశనగకు రూ.70 వేల వరకు ఖర్చు పెట్టినా ఎకరాకు బస్తా కూడా పండలేదని రైతు రామచంద్రనాయక్ వాపోయాడు. పదేళ్లుగా ఇవే బాధలు పడుతున్నామన్నారు. ఐదెకరాల వేరుశనగ సాగుకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశానని మరో రైతు కరావులపల్లి గోవిందరెడ్డి చెప్పాడు. మరో ఐదు ఎకరాల్లో కూరగాయలు, కళింగర లాంటి పంటలు వేస్తే గిట్టుబాటు లేక ఒక్కోసారి రోడ్డున పారబోస్తున్నామన్నాడు. ఈ ఏడాది రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందన్నారు. మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కోరాడు. వేరుశనగ పంటకు ఫసల్‌బీమా వర్తింపజేయాలని, ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. కరువు బృందం సభ్యులు కొత్తచెరువులో మధ్యాహ్న భోజనం ముగించుకున్నారు. 3.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎండిపోయి నెర్రెలు చీలిన బుక్కపట్నం చెరువును పరిశీలించారు. ఇక్కడ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సభ్యులను కలిసి జిల్లా పరిస్థితిని వివరించారు.
పోలీసుల అత్యుత్సాహం
జిల్లా కరువు పరిస్థితులపై వినతి పత్రం ఇవ్వడానికి సీపీఎం, సీపీఐ, రైతు సంఘం నాయకులు చేతిలో గడ్డి పట్టుకుని బుక్కపట్నం చెరువు దగ్గరకు రాగా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకున్నారు. ‘మీరు రైతులేనా? ఏదీ పాస్‌పుస్తకం చూపించండి’ అంటూ రైతు సంఘం నాయకులను గద్దిస్తూ చేతిలో ఉన్న గడ్డిని విసిరేసి తోసేశారు. ‘మేము రౌడీలమా? రైతుల సమస్యల గురించి అడగడానికి వచ్చామ’ని మొత్తుకున్నా వారు వినకుండా రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిని మాత్రమే కేంద్ర బృందం దగ్గరకు అనుమతించారు.
మామిడి తోట పరిశీలన
బుక్కపట్నం చెరువును చూసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు పెనుకొండ మండలం రాంపురం గ్రామం వద్ద చలపతి పొలంలో ఉపాధిహామీ పథకం కింద ఫారంపాండ్ తవ్వుతున్న కూలీలతో మాట్లాడారు. వేరే పనులు లేకపోవడంతో పనిదినాలు కనీసం 200 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పెనుకొండ వద్ద గొర్రెల అభివృద్ధి క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ పశుశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాయితీతో పశుదాణా, సైలేజ్‌బేల్స్ పంపిణీ గురించి తెలుసుకున్నారు. తర్వాత అదే మండలం కోనాపురంలో రైతు శ్రీనివాసరెడ్డికి చెందిన ఎండిన మామిడితోటను చూశారు. పెనుకొండకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. పెనుకొండ మండలం తిమ్మాపురంలో రైతు కిష్టప్పకు చెందిన ఎండిన జొన్న, కంది పంటలను చూశారు. పంటను కాపాడుకునేందుకు 800 అడుగులు బోరు వేసినా నీళ్లుపడలేదని రైతు తెలిపాడు. చివరగా సాయంత్రం 6.30 గంటలకు చెన్నేకొత్తపల్లి సమీపంలో రైతు శ్రీనివాసులుకు చెందిన ఎండిన కంది పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, జెడ్పీ చైర్మన్ చమన్ తదితరులు కేంద్ర బృందాన్ని కలిసి జిల్లా పరిస్థితిని వివరించారు. రాత్రి ఎనిమిది గంటలకు అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకుని.. అక్కడే బస చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శశిధర్ హిందూపురం వరకు పాల్గొనగా.. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం రైతులు చెప్పిన సమస్యలను కేంద్ర బృందానికి ఇంగ్లిష్‌లో వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, వ్యవసాయ, అనుబంధ శాఖలు, ఇరిగేషన్, ప్రణాళిక, భూగర్భజలశాఖ, సమాచార పౌరసంబంధాలశాఖ, ఐసీడీఎస్ తదితర అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.