అన్నదాతకు మళ్లీ నిరాశే.. | again farmer didnot get compensation to floods | Sakshi
Sakshi News home page

అన్నదాతకు మళ్లీ నిరాశే..

Published Wed, Nov 20 2013 4:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

again farmer didnot get compensation to floods

విపత్తులతో కుంగిపోయిన రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర బృందం అటువంటి చర్యలు చేపట్టకపోగా కనీసం వారితో మాట్లాడడానికి తీరిక కూడా కల్పించుకోలేదు. సుడిగాలి పర్యటన జరిపి, పంటపొలాలను చూసీచూడకుండా కేవలం గంటా 15 నిమిషాల్లో పర్యటనను ముంగించేసింది.  గత నెలలో వారం రోజులకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షాలకు జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకోలేక....నీరింకని కళ్లతో, బరువెక్కిన గుండెతో... ఎలా బతికేది  భగవంతుడా అంటూ బెంగపెట్టుకుని సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆదుకోవలసిన కేంద్ర బృందం కనీసం వారిని పలకరించలేదు...గుండె బరువు దిగేలా రెండు మాటలు కూడా చెప్పలేదు... ఓదార్చే ప్రయత్నమే చేయలేదు. కేంద్ర బృందం వస్తుంది... తమ బాధలు వింటుంది... కన్నీరు తుడుస్తుంది... కనికరిస్తుంది అని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులకు మాత్రం చాలా సమయాన్ని కేటాయించడం విశేషం. దీంతో ఈ బృందం పరిశీలనకు వచ్చిందా... లేక ఇది అధికార పార్టీ ప్రచారమా అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
 చీపురుపల్లి, న్యూస్‌లైన్: వర్షాలకు జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతినగా, వాటిని అంచనా వేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించగా, పరిశీలనకు వచ్చిన కేంద్రం బృందం కూడా అన్నదాతకు నిరాశే మిగిల్చింది. మంగళవారం భోగాపురం, చీపురుపల్లి మండలాల్లో నాలుగు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తొలుత భోగాపురం మండలంలోని భోగాపురం, రావాడ గ్రామాల్లో పర్యటించిన బృందం ఆ రెండు చోట్లా పంట నష్టపోయిన ఒక్క రైతుతోనూ మాట్లాడలేదు. ఆ రెండు గ్రామాల్లో ఒక్క పంట పొలాన్ని పరిశీలించలేదు. రైతులు తమ బాధలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టు పరిశీలించి కేవలం 15 నిమిషాలలో పర్యటన ముగించింది.
 
  మధ్యాహ్నం 2.45 గంటలకు వచ్చిన బృందం 3 గంటలకు తిరుగు ప్రయాణమైంది. అక్కడకు చేరుకున్న విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కేంద్రబృందానికి నివేదికలను అందజేశారు. అనంతరం చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం, కరకాం గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పత్తి, బొప్పాయి పంటలను పరిశీలించిన అనంతరం గొల్లలములగాంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర బృంద సభ్యులు మాట్లాడారు. ఈ గ్రామంలో 4.45 గంటల నుంచి  5.50 గంటల వరకూ ఉన్నారు. తరువాత కరకాం గ్రామంలో పంటపొలాలకు వెళ్లి కేవలం 10 నిమిషాల పాటు పరిశీలించి వెళ్లిపోయారు. అక్కడ కూడా రైతులతో మాట్లాడలేదు. ఒకరిద్దరు రైతులు మాట్లాడేందుకు ప్రయత్నించినా వారికి కూడా అవకాశం కల్పించలేదు. దీంతో  రైతులు నిరాశ చెందారు.
 
 అధికార పార్టీ నేతలైన ఎంపీ ఝాన్సీలక్ష్మి, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, సర్పంచ్‌లు, ఇతర నేతలతోనే కేంద్ర బృందం ముచ్చటించింది. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ, జేడీ లీలావతి  మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లాలో 16,936 హెక్టార్లలో పంటలు పాడయ్యాయని బృందం దృష్టికి తీసుకువెళ్లారు. 4,124 ెహ క్టార్లలో వరి, 2,641హెక్టార్లలో మొక్కజొన్న, 9,025 హెక్టార్లలో పత్తి, 79హెక్టార్లలో చెరుకు,420హెక్టార్లలో పెసర,355 హెక్టార్లలో మినప,140 హెక్టార్లలో కొర్రా,51 హెక్టార్లలో చోడి, 233హెక్టార్లలో వేరుశనగ పంటలు పాడయ్యాయని తెలిపారు. తాను కూడా రైతు బిడ్డనే  అని చెప్పుకున్న కేంద్ర బృందంలో ఒక సభ్యుడు గోపీకృష్ణకు రైతుల బాధలు వినాలని అనిపించలేదాని పలువురు రైతులు అనుకుంటున్నారు.
 
 ఇలా వచ్చారు...అలా వెళ్లారు
 కరకాం గ్రామంలో పాడైన పంటలను మంగళవారం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇలావచ్చి అలా వెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న పంటలను పరిశీలించి వెళ్లిపోయారు. సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం లే కుండా పోయింది. ఎంతో ఆశతో ఎదురుచూశాం కాని కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించలేదు.
 - మీసాల అప్పలనాయుడు,కరకాం, రైతు
 
 రైతులతో  మాట్లాడలేదు
 నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం మాతో ఏమీ మాట్లాడలేదు.   నేను ఈ ఏడాది బొప్పాయి పంటను సాగుచేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు బొప్పాయి పంట పూర్తిగా పాడైపోయింది. అధికారులు వస్తే చూపిద్దామనుకున్నాను. కానీ వచ్చిన వెంటనే వెళ్లిపోయారు. దీంతో నా పంటను చూపించలేకపోయాను.
 - మీసాల సూరినాయుడు,
  రైతు, కరకాం గ్రామం
 
 పొద్దుపోయాక వచ్చారు...
 పంటలను పరిశీలించ డానికి అధికారులు వచ్చేసరికి పొద్దుపోయింది. అధికారులు ముందే వచ్చి ఉంటే మా పంటలను చూపించి కష్టాలను చెప్పుకోవడానికి వీలయ్యేది. అధికారులు కూడా పంటపొలం వరకు వచ్చి వెళ్లిపోయారే తప్ప గ్రామంలోకి రాలేదు. ఒక పంటపొలంలో మాత్రమే పంటను పరిశీలించారు.  మిగిలిన రైతుల పంటలను పరిశీలించలేదు. నష్టపరిహారం వస్తుందో రాదో తెలియదు.
 - గంగుపల్లి వెంకన్న,రైతు, కరకాం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement