ఏలూరు జిల్లా ఆస్పత్రిలో బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న వైద్య నిపుణులు
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పలువురు ఆకస్మికంగా అస్వస్థతకు గురి కావడంపై నిశిత పరిశీలన చేసి కచ్చితమైన కారణాలను కనుక్కోవాలని కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. వ్యాధి మూలాలను కచ్చితంగా గుర్తించాలని, వీలైనంత త్వరగా అన్ని రకాల పరీక్షలను పూర్తి చేయాలని సూచిస్తూ శుక్రవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. తుది నివేదికల ఆధారంగా పరిస్థితిని చక్కదిద్దేలా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రధానంగా తాగునీటి వల్ల అస్వస్థత వచ్చిందా.. లేదా? అనే విషయంపై దృష్టి సారించాలన్నారు. మిగిలిన అంశాలపై కూడా పరిశోధించాలని సూచించారు.
కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కేసులు గణనీయంగా తగ్గాయని, కొత్తవి చాలా తక్కువగా వస్తున్నాయని, 3 – 4 గంటల్లోనే బాధితులు పూర్తిగా కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. నీటి వల్లే కాలుష్యం జరిగిందని ఊహించలేమని, ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయాల్లో రసాయనాల ప్రభావంపై పరిశీలించాల్సి ఉందని ప్రముఖ న్యూరాలజిస్టు చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వినియోగించిన బ్లీచింగ్, క్లోరిన్‌లు కూడా కారణం కావచ్చనే అనుమానాలు నిపుణులు వ్యక్తం చేశారు.
భారతీయుల్లో నికెల్ ఎక్కువే: ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు
ఇంకా సమగ్ర పరీక్షలు చేయాల్సి ఉంది. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోంది. నికెల్ కూడా కనిపిస్తోంది. భారతీయుల్లో నికెల్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీసం వల్లే అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. మరిన్ని శాంపిళ్లను పరీక్షిస్తున్నాం. బాధితులు కోలుకోగానే సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. వీలైనంత త్వరలో కారణాలపై కచ్చితమైన నిర్ధారణకు వస్తాం.
సీఎంతో సమీక్షలో పాల్గొన్న అధికారులు
బ్యాటరీల డంపింగ్‌తో..
గతంలో లెడ్ పెట్రోల్ వినియోగం ఉండేది. గాలిలో కూడా లెడ్ స్థాయి ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు అన్ లెడెడ్ పెట్రోల్ వాడుతున్నాం. బ్యాటరీల రీ సైక్లింగ్ ప్రక్రియ కూడా ఈ పరిస్థితికి దారి తీసి ఉండవచ్చు. బ్యాటరీలను డంప్ చేయడం వల్ల భూమిలో కలిసి ఉండవచ్చు. లేదా వాటిని కాల్చినప్పుడు గాలిలో కలిసి ఉండవచ్చు. కూరగాయలు, ధాన్యం లాంటి ద్వారా కూడా శరీరాల్లో చేరి ఉండవచ్చు. ఇలా వేర్వేరు మార్గాల్లో మనుషుల శరీరాల్లోకి సీసం చేరే అవకాశం ఉంది. వీటన్నింటి మీదా పరిశోధిస్తున్నాం.
పెస్టిసైడ్స్ కోణంలో పరిశీలన: ఎయిమ్స్ మంగళగిరి నిపుణులు
పురుగు మందుల ద్వారా ఆర్గానిక్ క్లోరైడ్స్ కలుషితమై అస్వస్థతకు దారి తీసిందన్నది ప్రాథమిక అనుమానం. దీనిపై కచ్చితమైన నిర్ధారణకు రావాల్సి ఉంది. అన్ని రకాలుగా అధ్యయనం చేస్తున్నాం.
ప్రమాదకర సంకేతాలు లేవు: ఎన్‌ఐఎన్, హైదరాబాద్ నిపుణులు
అస్వస్థతకు గురైన కుటుంబాలను పరిశీలించాం. ఐదు ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లాం. బాధితులు తీసుకున్న ఆహారం వివరాలు ఆరా తీశాం. కూరగాయలు, బ్లడ్, యూరిన్ శాంపిళ్లు తీసుకున్నాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి కూడా శాంపిళ్లు తీసుకున్నాం. కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసిన రెండు మార్కెట్ల నుంచి శాంపిళ్లు సేకరించాం. సమగ్రంగా పరీక్షలు చేస్తున్నాం. ప్రస్తుతానికి ప్రమాదకర స్థాయిలో సంకేతాలు ఏమీ కనిపించడం లేదు.
దాద్రానగర్ హవేలీలో మైనింగ్ చేస్తున్న సమయంలో నీటిలో లెడ్ కలుషితమైంది. పంటలకూ విస్తరించింది.
అధికంగా సీసం: ఐఐసీటీ, హైదరాబాద్ నిపుణులు
తాగు నీటిపై వివిధ రకాల శాంపిళ్లు తీసుకున్నాం. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోంది. పురుగు మందుల వల్ల కూడా కాలుష్య కారక మూలకాలు కలిసే అవకాశాలు ఉంటాయి. తాగు నీటి పరీక్షల్లో అనుకున్న విధంగా ప్రమాదకర సంకేతాలు కనిపించడం లేదు. కచ్చితమైన నిర్ధారణల కోసం సమగ్ర పరీక్షలు చేస్తున్నాం.
మరికొంత సమయం తరువాతే: సీసీఎంబీ
అస్వస్థతకు వైరల్ కారణమా? అన్న దానిపై పరీక్షలు చేస్తున్నాం. ఫలితాలు రావడానికి, కచ్చితమైన నిర్ధారణలకు కొంత సమయం పడుతుంది.
వివరాలు సేకరిస్తున్నాం: డబ్ల్యూహెచ్‌వో
‘బాధితులు తీసుకున్న ఆహారం సహా ఆరోగ్య పరమైన వివరాలు నమోదు చేస్తున్నాం. దీన్ని త్వరలోనే పూర్తి చేస్తాం.
హాజరైన ఉన్నతాధికారులు..
సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, న్యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పశ్చిమ గోదావరి కలెక్టర్ ముత్యాల రాజు తదితరులు ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.
ఏలూరుకు ఊరట
అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదించింది. ఐదో రోజు బాధితుల సంఖ్య తగ్గటంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంటోంది. బుధవారం రాత్రి 10 గంటల వరకు రోజంతా కేవలం 20 కేసులే నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. రాత్రి సమయానికి ఆస్పత్రిలో మొత్తం 42 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 563కి చేరుకుంది. ఈ నెల 6వతేదీన గుంటూరు ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స కోసం ఐదుగురు చేరగా ముగ్గురు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 24 మంది బాధితులు చేరగా ఇద్దరిని డిశ్చార్జి చేశామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివశంకరరావు చెప్పారు. పరిస్థితులను నిరంతరం అంచనా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తుండటంతో వేగంగా కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు.
ఇంటింటా సర్వే..
ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించి నిమిషాల వ్యవధిలో 108 అంబులెన్సుల ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ ఆరోగ్య స్థితిపై వివరాలు సేకరిస్తున్నారు.
శానిటేషన్‌పై మంత్రి నాని పాదయాత్ర
నగరంలో పారిశుధ్యం, తాగునీటిపై జాగ్రత్తలు సూచిస్తూ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నూకాలమ్మ గుడి వరకూ పాదయాత్ర చేశారు. డ్రైనేజీల్లో మురుగు తొలగిస్తున్నారా? తాగునీరు ఎలా ఉంది? అని మహిళలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment