సర్కారు బాసట.. కోలుకుంటున్నారు | AP Govt Support For Eluru Sick Victims For Treatment | Sakshi
Sakshi News home page

సర్కారు బాసట.. కోలుకుంటున్నారు

Published Mon, Dec 7 2020 2:55 AM | Last Updated on Mon, Dec 7 2020 10:20 AM

AP Govt Support For Eluru Sick Victims For Treatment - Sakshi

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని. చిత్రంలో ఎమ్మెల్యే వాసుబాబు, కలెక్టర్‌ ముత్యాలరాజు

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, అమరావతి: ఉన్నట్టుండి అస్వస్థతకు గురై ఇబ్బంది పడుతున్న ఏలూరు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. బాధితులందరికీ సత్వరమే మెరుగైన వైద్యం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం నుంచి ఏలూరులో ఫిట్స్‌ వ్యాధి లక్షణాలతో ప్రజలు ఆసుపత్రుల్లో చేరటం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా కింద పడిపోవటం, కొందరికి నోటి వెంట నురగలు రావటం, వాంతులు చేసుకోవటం, స్పృహ కోల్పోవటం వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురికావటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వ్యాధి ప్రభావం ఆదివారం నెమ్మదించింది. సాయంత్రానికి బాధితుల సంఖ్య 286కు చేరింది. సీఎం ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని మోహరించారు. బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించేలా పటిష్ట చర్యలు చేపట్టారు.

117 మంది డిశ్చార్జ్‌.. ఒకరు మృతి
– తొలుత ఏలూరు దక్షిణపు వీధి, పడమర వీధిలో ప్రారంభమైన ఈ వ్యాధి లక్షణాలు ఆదివారం ఉదయానికి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రుల్లో చేరిన 286 మంది బాధితుల్లో 117 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మిగతా వారు కోలుకుంటున్నారు. కాగా, విద్యానగర్‌కు చెందిన శ్రీధర్‌ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బాత్‌రూమ్‌కు వెళ్లి తల తిరిగి కింద పడిపోయాడు. చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. 
– పలువురు బాధితులు కొద్ది సేపటికే కోలుకుని సాధారణ స్థితికి రావటంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. శనివారంతో పోలిస్తే, ఆదివారం ఆస్పత్రికి వచ్చిన బాధితులు అందులో పాతిక వంతు కూడా లేకపోవడం ఊరట కలిగించింది. 
మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎమ్మెల్యే వాసు, కలెక్టర్‌ ముత్యాల రాజు తదితరులు 

అధికార యంత్రాంగం, వైద్య నిపుణుల పర్యవేక్షణ 
– ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో పూర్తిగా బాధితుల కోసమే వార్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 300 బెడ్స్‌ను సిద్ధంగా ఉంచిన అధికారులు, అవసరమైతే ఆశ్రం ఆస్పత్రి, ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
– ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో పాటు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఏలూరు ఆర్‌డీవో పనబాక రచన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సునంద, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ మామిళ్లపల్లి జయప్రకాష్, ఏపీ మెడికల్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ దిరిశాల వరప్రసాద్‌ జిల్లా ఆసుపత్రిలో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

సర్వే చేస్తూ ఇల్లిల్లూ ఆరా 
– అంతుచిక్కని వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సల నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని దక్షిణపు వీధి, పడమర వీధి ప్రాంతాలతో పాటు ప్రభావిత ప్రాంతాలలో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. 
– బాధితులు ఉంటున్న ప్రాంతాల్లో అశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటా ఆరోగ్య స్థితిపై సర్వే చేపట్టారు. ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లేలా సూచనలు చేస్తున్నారు.
– ఏలూరు నగరంతో పాటు తంగెళ్లమూడి, ఖండికగూడెం ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకులు, డ్రైయినేజీలను శుభ్రం చేయటం, బ్లీచింగ్‌ చల్లటం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
– విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఏలూరు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. వారు కూడా మంచినీటి శాంపిల్స్‌ టెస్టింగ్‌ నిర్వహించారు. నీటి శాంపిల్స్‌ అన్నీ బాగుండటం, బాధితులకు చేసిన సీటీ స్కాన్, రక్త పరీక్షలు కూడా నార్మల్‌ అని రావడంతో అసలు ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతోందనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో సోమవారం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ బృందాన్ని రప్పిస్తున్నారు. 

ఫలానా కారణమంటూ ఏదీ లేదు..  
ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రీవెంటివ్‌ మెడిసిన్‌) అధికారుల బృందం ఏలూరుకు చేరుకుంది. ఇప్పటి వరకు చేసిన టెస్టుల ఫలితాలన్నీ నార్మల్‌గా ఉన్నాయి. దీంతో కల్చర్‌ టెస్టు కోసం రక్త నమూనాలను విజయవాడలోని వీఆర్‌డీఎల్‌ ల్యాబొరేటరీకి పంపించారు. పాలలో హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్‌ ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తున్నారు. ఏలూరు బాధితుల నుంచి రక్త నమూనాలు, అక్కడి నీటి నమూనాలు సేకరించి పరిశీలించామని, ఫలానా కారణమంటూ ఏమీ తేలలేదని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఏలూరు వచ్చిన ఆయన కలెక్టర్‌ ముత్యాలరాజును కలిశారు. బాధితుల ఆరోగ్యస్థితిపై ఆరా తీశారు. ఈకోలీ పరీక్ష ఫలితం రావాల్సి ఉందన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ వారు సోమవారం ఏలూరు నగరానికి వస్తున్నారని, తాగునీటిపై వారు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. కాగా, ఇది ప్రమాదకరం కాదని ప్రాథమికంగా అంచనా వేశామని, అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గీతాప్రసాదిని విజయవాడలో పేర్కొన్నారు. 

పరిస్థితిపై సీఎం జగన్‌ ఆరా.. నేడు ఏలూరుకు 
ఏలూరులో ప్రజలు ఆకస్మికంగా అనారోగ్యం బారినపడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో ఫోన్‌లో సమీక్షించారు. సకాలంలో స్పందించి బాధితులకు బాసటగా నిలిచి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు అందించాలని చెప్పారు. వ్యాధి లక్షణాలు పూర్తి స్థాయిలో అ«ధ్యయనం చేసేందుకు ఏలూరుకు ప్రత్యేకంగా వైద్య బృందాలను పంపుతున్నామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి 10:20 గంటలకు ఏలూరు చేరుకుంటారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. 

ఐదుగురికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స
గుంటూరు ఈస్ట్‌:  పరిస్థితి తీవ్రంగా ఉన్న ఏలూరు ఆర్‌ఆర్‌పేటకు చెందిన కె.కుసుమకుమారి, పి.శంభులింగాచారి, పి.రమణమ్మ, దక్షిణపేటకు చెందిన పి.చలపతిరావు, ఎం.ఆండాళ్‌లకు మెరుగైన చికిత్స నిమిత్తం ఆదివారం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, ఆర్‌ఎఓఓ డాక్టర్‌ సతీష్‌కుమార్‌ పర్యవేక్షణలో వారికి చికిత్స చేస్తున్నారు. వీరికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌తోపాటు ఇతర పరీక్షలు చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు.

విజయవాడలో నలుగురికి చికిత్స
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ఏలూరుకు చెందిన సురేష్‌ (24), నాలుగు నెలల గర్భిణీ కె.అనురాధ(27), బి సింహాచలం(80), ప్రభ (6) విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నలుగురిని న్యూరాలజిస్టులు, జనరల్‌ మెడిసిన్, అనస్థీషియా నిపుణులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రభ ఆరోగ్యం కుదుటపడిందని, ఆదివారం సాయంత్రం పాలు కూడా తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. సురేష్, అనురాధలు కొద్దిగా మగతలో ఉన్నట్లు తెలిపారు. గైనకాలజిస్టులు అనురాధకు స్కాన్‌ చేసి, పరిశీలించారు. 80 ఏళ్ల సిహాచలంకు బీపీ ఉందని, సీటీ స్కాన్‌లో బ్రెయిన్‌లో క్లాట్స్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అవి ఇప్పుడు వచ్చినవి కావని, పాతవేనని చెపుతున్నారు. ఈమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే వారికి ఫిట్స్‌ ఎందుకు వచ్చాయనేది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement