భూగర్భ జలాల పెరుగుదలపై దృష్టి
- జిల్లాకు చేరుకున్న కేంద్రబృందం
– జిల్లా కలెక్టర్ చెప్పిన అంశాలపై పరిశీలన
– నేడు క్షేత్ర స్థాయికి వెళ్లనున్న బృందం సభ్యులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో భూగర్బ జలాల పెరుగుదలను పరిశీలించేందుకు మంగళవారం సాయంత్రం కేంద్రబృందం కర్నూలుకు వచ్చింది. ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డుకు కర్నూలు జిల్లా ఎంపికైన నేపథ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఢిల్లీ వెళ్లి భూగర్భ జలాలు పెరగడానికి దోహద పడిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. పవర్‌పాయింట్‌లోని అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కేంద్రం టెలికమ్యూనికేషన్స్ శాఖ డిప్యూటీ సెక్రటరీ అహోక్, డైరెక్టర్ బీరేంద్రకుమార్ అనే ఇద్దరు ఉన్నతాధికారులను జిల్లాకు పంపింది.
స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ఈ బృందానికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వివిధశాఖల అధికారులు స్వాగతం పలికారు. ఉద్యమ తరహాలో చేపట్టిన కార్యక్రమాలతో భూగర్బ జలాలు గణనీయంగా పెరిగాయని కలెక్టర్ వారికి వివరించారు. ఇందువల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించిన అంశాలను బృందం బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనుంది. కార్యక్రమంలో సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.