Central Ministry Of Jal Shakti Committee Satisfaction on Polavaram Works, Details In telugu - Sakshi
Sakshi News home page

Polavaram Project: పోలవరం పనులు భేష్‌

Published Thu, Dec 30 2021 2:16 AM | Last Updated on Thu, Dec 30 2021 9:25 AM

Central Ministry Of Jal Shakti Committee Satisfaction on Polavaram Works - Sakshi

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, నాణ్యతపై కేంద్ర జల్‌ శక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. జల్‌ శక్తి శాఖ కమిషనర్‌ ఏఎస్‌ గోయల్, సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ అనూప్‌కుమార్‌ శ్రీవాత్సవ నేతృత్వంలోని ఈ కమిటీ మంగళవారం పోలవరం ఎడమ కాలువను పరిశీలించింది. బుధవారం ప్రాజెక్టు స్పిల్‌ వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, అనుసంధానాల పనులు, జలవిద్యుత్‌ కేంద్రం కొండ తవ్వకం పనులు, గ్యాప్‌–1లను, పునరావాస కాలనీలను తనిఖీ చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. వివరాలను ప్రాజెక్టు సీఈ బి.సుధాకర్‌బాబు, ఎస్‌ఈ కె.నరసింహమూర్తుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ, సహాయ పునరావాస విభాగం అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగవంతం చేయాలని కమిటీ ఆదేశించింది.  
పనుల వివరాలను మ్యాప్‌ ద్వారా తెలుసుకుంటున్న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ జాయింట్‌ కమిషనర్‌ అనూప్‌కుమార్‌ శ్రీవాత్సవ  

2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే మరింత వేగంగా పునరావాసం కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఈ వ్యయాన్ని సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ 2019లోనే ఆమోదించిందని వివరించారు. ఆ తర్వాత రివైజ్ట్‌ కాస్ట్‌ కమిటీ రూ.47,727.87 కోట్లకు అంచనా వ్యయాన్ని ఆమోదించిందన్నారు. సవరించిన అంచనా వ్యయానికి పెట్టుబడి అనుమతి ఇచ్చి, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని చెప్పారు. దేశంలోని ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి కూడా నీటిపారుదల, సరఫరా విభాగం వ్యయాన్ని ఒకటిగానే లెక్కించి, నిధులివ్వాలని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చిందని వివరించారు. దీనిపై గోయల్‌ సానుకూలంగా స్పందించారు. సీడబ్ల్యూసీ నివేదికను కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి మరోమారు తీసుకెళ్తామని అన్నారు. పెట్టుబడి అనుమతితోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదిక ఇస్తామని చెప్పారు. 

డిజైన్ల ఆమోదంలో జాప్యం వల్లే.. 
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేను మే నాటికి, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను జూన్‌ మొదటి వారానికే పూర్తి చేసి.. జూన్‌ 11న అప్రోచ్‌ చానల్‌ మీదుగా గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించామని అధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. 2018లో పనులను అసంపూర్తిగా వదిలేయడం వల్ల 2019లో వచ్చిన వరదలకు ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మించే ప్రదేశంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతం, ఇసుక పొరలను పటిష్టం చేసే డిజైన్ల  ఆమోదంలో జాప్యం వల్లే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనుల ప్రారంభం ఆలస్యమవుతోందన్నారు.

ఈనెల 7న డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ) చైర్మన్‌ ఏబీ పాండ్య వస్తున్నారని, అప్పుడు ఈ డిజైన్‌ను కొలిక్కి తెస్తామని, దాన్ని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వెంటనే ఆమోదించేలా చూడాలని కోరారు. దీనిపై గోయల్‌ స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న డిజైన్లను వేగంగా ఆమోదించాలని సీడబ్ల్యూసీకి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. డిజైన్‌ ఆమోదం అనంతరం పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీల సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్‌) రూపకల్పన తుదిదశలో ఉందని, అవి పూర్తికాగానే టెండర్లు పిలిచి.. వాటి పనులను వేగంగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. కమిటీ సభ్యులు గురువారం ఉదయం పోలవరం కుడి కాలువ పనులను తనిఖీ చేస్తారు. శుక్రవారం విజయవాడలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement