రేపట్నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ అమలు.. | Central Government Issued Gazette Notifications On Krishna And Godavari Board | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ అమలు..

Published Wed, Oct 13 2021 1:33 AM | Last Updated on Wed, Oct 13 2021 8:19 AM

Central Government Issued Gazette Notifications On Krishna And Godavari Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. అనేక చర్చలు, వాదోపవాదాలు, అభ్యంతరాల నడుమ ప్రయోగాత్మకంగా తొలిదశలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ప్రాజెక్టుల నుంచి కేంద్రం స్వాధీన ప్రక్రియ మొదలు పెట్టనుంది.

గోదావరిలో ఒక్క పెద్దవాగు ప్రాజెక్టుపై బోర్డు పెత్తనం ఉండనుండగా కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై ఉన్న 16 ఔట్‌లెట్‌లను స్వాధీనం చేసుకొని నిర్వహణ బాధ్యతలు చూసేలా రంగం సిద్ధం చేసుకుంది. కృష్ణాలో బోర్డు ప్రతిపాదించిన ఔట్‌లెట్‌లపై ఏపీ నుంచి అభ్యంతరాలు లేకున్నా తెలంగాణ మాత్రం విద్యుదుత్పత్తి కేంద్రాలు (పవర్‌హౌస్‌)లపై బోర్డు పెత్తానాన్ని సహించలేమని స్పష్టం చేస్తోంది. ప్రతిపాదిత ఔట్‌లెట్‌లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సమ్మతిస్తుండగా తెలంగాణ మాత్రం తమ ప్రభుత్వంతో చర్చించాకే వైఖరిని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల జారీపై సందిగ్ధత నెలకొంది.

పవర్‌హౌస్‌లపై వాడీవేడిగా చర్చ...
ఈ నెల 14 నుంచి గెజిట్‌ అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసే క్రమంలో సోమవారం గోదావరి బోర్డు భేటీ కాగా మంగళవారం కృష్ణా బోర్డు భేటీ జలసౌధలో జరిగింది. కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ మోహన్‌రావు తదితరలు పాల్గొన్నారు. ఏపీ తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చర్చంతా బోర్డుల పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపైనే జరిగింది. కృష్ణా బోర్డు సబ్‌ కమిటీ మొత్తంగా శ్రీశైలంపై ఉన్న 12 ఔట్‌లెట్‌లు, సాగర్‌ పరిధిలోని 18 ఔట్‌లెట్‌లను కలిపి మొత్తం 30 ఔట్‌లెట్‌లు బోర్డు పరిధిలో ఉంచాలని ప్రతిపాదించింది. అయితే దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పవర్‌హౌస్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అధీనానికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ‘కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం కొత్త ట్రిబ్యునల్‌ వేయాలని ఇప్పటికే కేంద్రం, కోర్టు ముందు ప్రతిపాదనలు పెట్టాం.

ఈ దశలో నీటి కేటాయింపులు తేలేదాక గెజిట్‌ అమలును ఆపాలి’ అని రజత్‌ కుమార్‌ వాదించారు. అయితే గెజిట్‌ వెలువడ్డాక, అమలును ఆపలేమని బోర్డు చైర్మన్‌ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీ తరఫున శ్యామలరావు మాట్లాడుతూ విద్యుదుత్పత్తి ఆపాలని పదేపదే కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని, తక్షణమే విద్యుదుత్పత్తి ఆపేలా చూడాలని కోరారు. దీనికి రజత్‌ కుమార్‌ స్పందిస్తూ రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు తీవ్రంగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు అయినందున ఉత్పత్తి ఆపడం కుదరదని తేల్చిచెప్పారు.

దీనిపై మరోమారు కల్పించకున్న శ్యామల్‌రావు... ఈ ఏడాది పులిచింతల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుపుతున్నారన్న తమ ఫిర్యాదు నేపథ్యంలో గెజిట్‌ వెలువడిందని... ఈ నేపథ్యంలో పవర్‌హౌస్‌లను కాదని మిగిలిన ఔట్‌లెట్‌లను బోర్డు పరిధిలో ఉంచుతామంటే కుదరదని ఏపీ తేల్చిచెప్పింది.

16 ప్రాజెక్టులపై బోర్డు తీర్మానం...
ఇరు రాష్ట్రాల వాదోపవాదాల అనంతరం పవర్‌హౌస్‌లు కలుపుకొని 16 ఔట్‌లెట్‌లను తన పరిధిలోకి తీసుకునేలా బోర్డు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ఏపీ ఓకే చెప్పింది. 16 ఔట్‌లెట్‌లపై బోర్డు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వపరంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు సమ్మతించింది. అయితే దీనిపై తెలంగాణ మత్రం నిర్ణయం చెప్పలేదు. పవర్‌హౌస్‌లను సైతం తీసుకుంటామని చెబుతున్నందున దీనిపై ప్రతిపాదనలు వచ్చాక ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ప్రభుత్వ అనుమతి వచ్చాకే ఔట్‌లెట్‌లను అప్పగిస్తామని తెలిపింది. ఇక ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించినా కేవలం నిర్వహణ (ఆపరేషన్స్‌) మాత్రమే చూడాలని, ప్రాజెక్టులపై యాజమాన్య హక్కు (ఓనర్‌షిప్‌) మాత్రం రాష్ట్రానికే ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ భేటీ అనంతరం ఒక ప్రకటన విడుదల చేసిన కృష్ణా బోర్డు... ‘శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రధాన రిజర్వాయర్‌ల పరిధిలో గెజిట్‌ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌–2లో పేర్కొన్న అన్ని ఔట్‌లెట్‌లను ప్రాధాన్యంగా రెండు రాష్ట్రాలు ఈ నెల 14లోగా బోర్డుకు అప్పగించాలి’ అని బోర్డు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఇప్పటికే జరిగిన గోదావరి బోర్డు భేటీలో పెద్దవాగును ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించగా, దీనిపై రెండు రాష్ట్రాలు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఇక ఇరు రాష్ట్రాలు కూడా రెండు బోర్డులకు విడివిడిగా ఇవ్వాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌ మనీకి సంబందించి ప్రభుత్వంతో చర్చించాకే నిధుల విడుదలపై నిర్ణయం చెబుతామని వెల్లడించాయి.

బోర్డు బాధ్యత ఇదీ...
కృష్ణా, గోదావరి బేసిన్‌ పరిధిలో ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు కట్టబెడుతూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించగా రెండు రాష్ట్రాల్లోని నదులు, ఉపనదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ మొదటి షెడ్యూల్‌లో చేర్చింది. షెడ్యూల్‌– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు 100 శాతం బోర్డుల పరిధిలో ఉంటాయి. ఈ ప్రాజెక్టుల్లోని ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్‌ సహా అన్నింటినీ బోర్డులు తమ అధీనంలోకి తీసుకొని రోజువారీ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తాయి.

వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో కేంద్రం భద్రత కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. బోర్డులు తాము స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్‌–1లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్‌లో ఏవైనా కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. షెడ్యూల్‌–3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

గెజిట్‌ ప్రకారం షెడ్యూల్‌–2లో పేర్కొన్న ప్రాజెక్టులు ఇవీ..
కృష్ణాలోః శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, ఎడమ, కుడి గట్టు విద్యుత్‌ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, బంకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్‌ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్‌ఎస్‌ఎస్, నాగార్జునసాగర్‌ పరిధిలో సాగర్‌ ప్రధాన విద్యుత్‌ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్‌ కెనాల్‌లు, ఏఎంఆర్‌పీ, హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, సాగర్‌ టెయిల్‌పాండ్, తుంగభద్ర, దాని పరిధిలోని హైలెవల్, లోలెవల్‌ కాలువలు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్‌ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్‌ నుంచి శామీర్‌పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు–పాకాల ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంప్‌హౌస్, ఎస్సారెస్పీ స్టేజ్‌–2లోని మైలవరం రిజర్వాయర్, వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్‌ఎంసీ–ఎన్‌ఎస్‌–ఎల్‌ఎంసీ లింకు, పోలవరం–కృష్ణా లింకు, కృష్ణా డెల్టా, గుంటూరు కెనాల్‌.

గోదావరిలోః పెద్దవాగు రిజర్వాయర్‌ స్కీమ్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు, హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణాకు గోదావరి నీటి తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు, పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తపట్టణం ఎత్తిపోతలు, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజి, తొర్రిగడ్డ ఎత్తిపోతలు, చింతలపూడి ఎత్తిపోతలు, చాగలనాడు ఎత్తిపోతలు, వెంకటనగరం ఎత్తిపోతలు, శ్రీరాంసాగర్‌ స్టేజ్‌–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు (అదనంగా రోజుకు ఒక టీఎంసీ), చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకులగూడెం బ్యారేజి, ముక్తేశ్వర్‌ ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతల, మాచ్‌ఖండ్‌ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement