సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులు రెండేళ్ల పాటు ఎండిపోయినా హైదరాబాద్‌లో తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజధానిలో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.1,900 కోట్లతో 1,900 కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేస్తున్నామని చెప్పారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న 190 గ్రామాలు, ఆవాసాలకు ‘మిషన్ భగీరథ’నీళ్లు అందిస్తున్నామని చెప్పారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గుట్టలు, రాళ్లు ఉండటంతో పనుల్లో జాప్యం జరుగుతోందని స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్ సభ దృష్టికి తీసుకురాగా.. ప్రత్యేక రాక్ కటింగ్ బృందం ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దండు మల్కా పురం గ్రామంలో చిన్న, సూక్ష్మ తరహా పారి శ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 343 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని.. దీని ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగా, 24 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పెళ్లి రోజునే చెక్కులు:మంత్రి జోగు రామన్న
పెళ్లయిన 6 నెలలకు కూడా కల్యాణలక్ష్మి చెక్కులు అందడం లేదని, బీసీలకు ఇంతవరకు బడ్జెట్ ఇవ్వలేదని సభ్యులు అజ్మీరా రేఖ, పువ్వాడ అజయ్‌కుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. చెక్కుల మంజూరులో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని మరో సభ్యుడు జాఫర్ హుస్సేన్ ఆరోపించారు. దీనిపై మంత్రి జోగు రామన్న సమాధానమిస్తూ.. పెళ్లి రోజునే లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం చెక్కులు అందేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నా మని చెప్పారు.
చెక్కుల మంజూరులో అవకతవకలకు పాల్పడే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి గనుల కోసం సేకరిస్తున్న భూముల్లో పట్టా భూములకే పరిహారం ఇస్తున్నారని, అసైన్డ్ భూములకు ఇవ్వడం లేదని సభ్యులు సండ్రవెంకట వీరయ్య, సున్నం రాజయ్య, చిన్నయ్య ప్రశ్నించారు. దీనికి మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిస్తూ.. రెవెన్యూ విషయాలు జిల్లా కలెక్టర్లే చూసుకుంటున్నారని, అభ్యంతరాలుంటే వారితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment