సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర జల శక్తి శాఖ నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీకి తెలంగాణ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కేంద్రం, బోర్డులు లేవనెత్తే అన్ని అంశాలకు గట్టిగా సమాధానం ఇచ్చేలా సమగ్ర నివేదికలు తయారు చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కౌన్సిల్ చైర్మన్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన వెబినార్ ద్వారా జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ సీఎంలు, కేంద్ర జల సంఘం అధికారులు, కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్‌లు పాల్గొన నున్నారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, వాటి డీపీఆర్‌ల సమర్పణ, బోర్డుల పరిధి వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
పునఃకేటాయింపులు.. సమ న్యాయం
అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం ముందు లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో చర్చించారు. కేంద్రం తీరును గట్టిగా ఎండగట్టేలా నివేదికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా కేంద్రం తీరు వల్లే వివాదాలు పెరిగాయని, వారి పట్టింపు లేనితనం వల్లే అవి ముదురుతున్నాయన్న అంశాలను అపెక్స్ భేటీలో ఎత్తిచూపాలని నిర్ణయించారు. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్–3 మేరకు ఏ రాష్ట్రమైనా ఫిర్యాదు చేసిన ఏడాదిలో పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలని స్పష్టంగా ఉన్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదంటున్న రాష్ట్రం ఈ అంశంపై కేంద్రాన్ని కడిగేయాలని నిర్ణయించింది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతమే ఉన్నాయని, తెలంగాణలో ఉన్న ఆయకట్టు ప్రాంతం 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు మాత్రం సరిపోవని తెలంగాణ ఇప్పటికే కేంద్రం దృష్టికి తెచ్చింది.
పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాలని రాష్ట్రం అంటోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం విజ్ఞప్తి చేసినా, ట్రిబ్యునల్ పట్టించుకోని దృష్ట్యా, దీనిపై పునఃసమీక్షించి కేటాయింపులు చేయాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని గట్టిగా కోరనుంది. ఇక రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 (ఏ), సెక్షన్ (బీ)లకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణకు సంబంధించిన అవసరాలను, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచారణ చేయాలని కేంద్రం స్పష్టంగా సూచించకపోవడంతో ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి న్యాయం జరగట్లేదని ప్రభుత్వం బలంగా భావిస్తోంది.
ఈ అంశాలనే ప్రధాన అస్త్రాలుగా అపెక్స్ భేటీలో కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక బేసిన్‌లో లేని ప్రాంతాలకు కృష్ణా నది నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకొని వెళుతున్నా, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టినా, వాటిని నిలుపుదల చేయడంలో బోర్డు విఫలమైన తీరును ఎండగట్టే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాల్వలను విస్తరించడంపై అభ్యంతరం తెలపడంతోపాటు వాటిని ఆపించేలా ఒత్తిడి తీసుకురానుంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని, అవన్నీ పాత ప్రాజెక్టులేనని నిరూపించే జీవోలు, అనుమతుల వివరాలతో తెలంగాణ సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment