నదీజలాలపై కేంద్ర గెజిట్‌ చెల్లదు!  | States Have Full Control Over Water Of Krishna And Godavari | Sakshi
Sakshi News home page

నదీజలాలపై కేంద్ర గెజిట్‌ చెల్లదు! 

Published Mon, Feb 14 2022 1:07 AM | Last Updated on Mon, Feb 14 2022 2:47 PM

States Have Full Control Over Water Of Krishna And Godavari - Sakshi

మాట్లాడుతున్న మాడభూషి శ్రీధర్‌   

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీజలాలపై హక్కులను స్వాధీనం చేసుకుంటూ 2021 జూలై 15న కేంద్రం రీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్‌ తేల్చి చెప్పారు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులను తీసుకునే అధికారం కేంద్రానికి లేదని, ఇలా చేయడం రాష్ట్రాన్ని తీవ్రంగా అవమానించడమేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఈ నదులు ప్రవహిస్తున్నా.. అక్కడ కేంద్రం తీసుకోలేదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 (సమానత్వ హక్కు)కు విరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే ఆ గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆదివారం తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం, తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాడభూషి శ్రీధర్‌ మాట్లాడారు. నీటివనరులు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశమని.. అందువల్ల నదీజలాల వినియోగంపై రాష్ట్రాలే సంపూర్ణ హక్కు, అధికారాలను కలిగి ఉంటాయని గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికే కేంద్ర ప్రభుత్వం పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్రాష్ట జల వివాదాల పరిష్కార చట్టం కింద ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం ఏడేళ్ల కిందే ఏర్పాటు చేసినా, వాటి విధులేమిటో ఖరారు చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందని వివరించారు.

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణాజలాల పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని.. కానీ దీనిపై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. తక్షణమే కేంద్రం కృష్ణా, గోదావరి అపెక్స్‌ కౌన్సిళ్ల భేటీలను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపు తన పరిధిలో లేదని కృష్ణా అవార్డ్‌ డిస్ప్యూట్స్‌ ట్రిబ్యునల్‌ పేర్కొనడం దారుణమన్నారు. కేంద్రం గెజిట్‌ను ఉపసంహరించుకోవాలంటూ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తామని.. ప్రధాని, కేంద్ర మంత్రులకూ పంపుతామని తెలిపారు. ఒకవేళ కేంద్రం స్పందించకుంటే సుప్రీంకోర్టులో పిల్‌ వేస్తామన్నారు.

గెజిట్‌ అమలైతే.. తాగునీటికి కటకటే! 
ఏపీ, తెలంగాణలకు నీటివాటాలను కేటాయించకుండానే కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రయోజనం లేదని రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ ఫోరం కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయింపులు జరగపోతే.. కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు లభించవని గుర్తుచేశారు. అనుమతులు లేని ప్రాజెక్టులను నిలిపేయాలని గెజిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో.. పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఉదయ సముద్రం వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డితోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్‌ వంటి ప్రాంతాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టులనూ నిలిపేయాల్సి ఉంటుందని, అదే జరిగితే రాష్ట్రంలో సగం జనాభాకు తాగునీటి కొరత ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్‌ పాండురంగారెడ్డి, టీడీఎఫ్‌ ఇండియా అధ్యక్షుడు వి.రాజారెడ్డి, చైర్మన్‌ బి.రణధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement