కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాం: ఏపీ ఈఎన్‌సీ | Krishna Godavari River Management Board Meeting Today August 3rd | Sakshi
Sakshi News home page

ముగిసిన కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీ

Published Tue, Aug 3 2021 11:56 AM | Last Updated on Tue, Aug 3 2021 3:52 PM

Krishna Godavari River Management Board Meeting Today August 3rd - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జలసౌధలో జరిగిన కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శులు, కేంద్ర జలశక్తిశాఖ ప్రతినిధి తదితరులు హాజరయ్యారు.
అదే విధంగా... ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈఎన్‌సీ, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు హాజరయ్యారు. అయితే, తెలంగాణకు చెందిన ట్రాన్‌స్కో, జెన్‌కో అధికారులు మాత్రం సమావేశానికి రాలేదు. ఇక భేటీ అనంతరం ఏపీ ఈఎన్‌సీ మాట్లాడుతూ... ‘‘గెజిట్‌ ప్రకారం ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలన్న కృష్ణా, గోదావరి బోర్డులు నోటిఫికేషన్‌లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాం. టైం షెడ్యూల్ ప్రకారం సమాచారం కావాలని కోరారు’’ అని తెలిపారు.

కాగా నదీ జలాల విషయంలో బోర్డులకు పూర్తిస్థాయి అధికారాలు కేటాయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిషికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. గత నెల 29న గోదావరి బోర్డు.. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం ఈ కమిటీ భేటీ నిర్వహించనున్నట్లు 30న రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే, ఈ అంశంపై సోమవారం స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందుకే వీటిని పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. బోర్డు భేటీలో అభిప్రాయాలు, మార్గదర్శకాలు తెలుసుకోకుండా నేరుగా సమన్వయ కమిటీ భేటీలో గెజిట్‌పై చర్చించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే దీనిపై గోదావరి బోర్డు వెంటనే స్పందించి గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌ అవస్థీ రాసిన లేఖను ప్రస్తావిస్తూ తెలంగాణకు లేఖ రాసింది.

‘గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని పేర్కొన్నాం. దీనికి అనుగుణంగా అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన సమాచారం ఆగస్టు 2లోగా మాకు ఇవ్వాలి’ అని కేంద్రం రాసిన లేఖను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా నిర్వహిస్తున్నామని వెల్లడించింది. అదే విధంగా..  కృష్ణా బోర్డు సైతం 12 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారమే లేఖ రాసింది. అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడం గమనార్హం. ఈ క్రమంలో... కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహిస్తే హాజరవుతామని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement