నామినేటెడ్‌ పోస్టు.. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల చుట్టూ ప్రదక్షిణ! | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ పోస్టు.. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల చుట్టూ ప్రదక్షిణ!

Published Thu, Jan 4 2024 12:20 AM | Last Updated on Thu, Jan 4 2024 10:18 AM

- - Sakshi

'కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది. సంక్రాంతి పండుగలోగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆశావహులు ఉత్సాహంగా ఉన్నారు. ఇదే సమయాన ఉమ్మడి జిల్లా నుంచి ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ పలువురు ప్రదక్షిణ చేస్తున్నారు. పార్టీకి తాము చేసిన సేవలు, ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి చేసిన కృషిని వివరిస్తూ నామినేటెడ్ పోస్టు ఇప్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రధాన నామినేటెడ్ పోస్టులకు జిల్లా నుంచి ఎక్కువ మంది పోటీలో ఉండగా తొలి విడతలో ఎవరికి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ నెలకొంది.' - సాక్షి ప్రతినిధి, ఖమ్మం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన..
మార్చిలోగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసి క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్న నేతల వివరాలను టీపీసీసీ సేకరిస్తోంది. ఆయా నేతలకు గల జనబలం, పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు.. తదితర అంశాలను బేరీజు వేస్తూ జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ జాబితా ఆధారంగా సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులతో చర్చించాక ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రధానమైనవి తొలుత భర్తీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే, ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన నామినేటెడ్‌ పోస్టులు కొన్నింట్లో స్థానిక నేతలను నియమిస్తారని తెలుస్తోంది. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో నాయకులంతా ఏకతాటిపై నడిస్తే మెజార్టీ స్థానాలు పార్టీకి దక్కుతాయ నే అంచనాల్లో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు.

జాబితా పెద్దదే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు నేతలు నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. వైరా నియోజకవర్గం నుంచి బొర్రా రాజశేఖర్‌, లోకేష్‌యాదవ్‌, మధిర నియోజకవర్గం నుంచి పైడిపల్లి కిషోర్‌, డాక్టర్‌ కోట రాంబాబు, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్‌, ఖమ్మం నుంచి పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సాధు రమేష్‌రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణరావు, శెట్టి రంగారావు జాబితాలో ఉన్నారు. అలాగే, కొత్తగూడెం నుంచి నాగా సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, పినపాక నియోజకవర్గం నుంచి భట్టా విజయ్‌గాంధీ, తుళ్లూరి బ్రహ్మయ్య, ఇల్లెందు నియోజకవర్గం నుంచి రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, వడ్లమూడి దుర్గా ప్రసాద్‌, మేకల మల్లిబాబుయాదవ్‌, అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి జూపల్లి రమేష్‌బాబు, ఆలపాటి రామచంద్రప్రసాద్‌ పదవులు ఆశిస్తున్నారు.

ఇక పాలేరు నియోజకవర్గం నుంచి రామసహాయం నరేష్‌రెడ్డి, రామసహాయం వెంకట్‌రెడ్డి, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, శాఖమూరి రమేష్‌, చావా శివరామకృష్ణ పోస్టులు దక్కించుకోవాలనే యత్నాల్లో ఉన్నారు. ఇందులో చాలా మంది రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పోస్టులపై ఆశ పెట్టుకోగా.. కొందరు ఉమ్మడి జిల్లా, ఇంకొందరు జిల్లా స్థాయి నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్నారు. కాగా, ముగ్గురు, నలుగురు నేతలు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టు దక్కకపోతే ఎమ్మెల్సీ కోసం పోటీ పడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయ భవిష్యత్‌ కోసం..
నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్న నేతలు పలువురు తాము రేసులో ముందున్నామని ప్రచారం మొదలుపెట్టారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను కలుస్తూ పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలు, గతంలో నిర్వహించిన పోస్టుల వివరాలను ఇస్తున్నారు. అలాగే ఏఐసీసీ, టీపీసీసీలో తెలిసిన నేతలను కలిసి నామినేటెడ్‌ పోస్టుల విషయంలో వారి సహకారం కోరుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు ముగ్గురు మంత్రులతో పాటు పార్టీ పెద్దలనూ కలిశారు. సామాజిక సమీకరణాలను కూడా పరిశీలించి తమకు అవకాశం ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నేపథ్యాన ఎలాగైనా నామినేటెడ్‌ పోస్టు దక్కించుకుంటే రాజకీయ భవిష్యత్‌కు ఢోకా ఉండదని ఆశావహులు భావిస్తున్నారు.

ఇవి చ‌ద‌వండి: ‘గ్రేటర్‌ వరంగల్‌’లో బీఆర్‌ఎస్‌కు షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement