మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అప్పులు తీరుస్తూనే సంక్షేమాన్ని అందిస్తున్నాం
తుక్కుగూడ సభకు లక్షలాదిగా తరలిరావాలి
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: పదేళ్ల కాలంలో రైతు రుణమాఫీ చేయని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అన్ని ప్రభుత్వ శాఖలను బీఆర్‌ఎస్ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. అవినీతి, కబ్జాలతో పాటు పోలీసుల సహకారంతో బీఆర్‌ఎస్ నేతలు తిరిగి అధికారంలోకి వస్తామని అనుకున్నా.. కాంగ్రెస్ శ్రేణుల శక్తిసామర్థ్యాల ఎదు ట వారి ఆశలు పటాపంచలయ్యాయని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీ కడుతూనే హామీలను నెరవేరుస్తున్నామని తుమ్మల చెప్పారు. కాగా, అన్నిచోట్ల పంటలు కోతకు వచ్చాయని, జిల్లాలో నీరు లేక ఎక్కడా పంట ఎండిపోలేదన్నారు.
వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలపైనే రైతులు ఆధారపడుతున్నందున ఒక్క సెకన్ కూడా కరెంట్ పోకుండా రోజుకు రూ.50కోట్లు వెచ్చించి రాష్ట్రంలో కరెంట్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్‌ఎస్ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని.. కానీ వారికి అసెంబ్లీ ఎన్నికల మాదిరి పరాభవం తప్పదని చెప్పారు. తమ 120 రోజుల పాలనతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని.. అందుకనే ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలను దేశమంతా అమలు చేస్తామని ప్రకటించేందుకు రాహుల్‌గాంధీ, ఖర్గే శనివారం తుక్కుగూడ సభకు వస్తున్నారని తెలిపారు.
ఈమేరకు జిల్లా నుంచి నుంచి తుక్కుగూడ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావీద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడగా డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు లకావత్ సైదులు, మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రాపర్తి శరత్, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, కొంగర జ్యోతిర్మయి, పొదిల రవికుమార్‌తో పాటు నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment