సీపీఎం, సీపీఐ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టున్న సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచిచూస్తున్నాయి. బీఆర్‌ఎస్‌తో వెళ్లేది లేదని ఖరాఖండిగా చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. ఉభయ పార్టీల ప్రతిపాదనపై ఇప్పటివరకు కాంగ్రెస్ స్పందించకపోవడంతో కామ్రేడ్స్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
సీపీఎం ఇప్పటికే నిరీక్షణను పక్కనపెట్టి భువనగిరి అభ్యర్థిని ప్రకటించడమే కాక మిగతా స్థానాల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది. సీపీఐ మాత్రం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నందున రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానమైనా తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలవకపోవడంతో ఈనెలాఖరు నాటికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేశాయి. సీపీఎం నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో.. సీపీఐ మహబూబాబాద్, భువనగిరిలో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఉమ్మడి జిల్లాలో ఒంటరిగా, సీపీఐ కాంగ్రెస్‌తో జత కట్టాయి. ఆ ఎన్నికల్లో నమోదైన ఓట్ల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థిని ప్రకటించగా.. నేడో, రేపో ఖమ్మం అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశముంది.
దీంతో సీపీఎం భువనగిరి ఒక్క స్థానానికే పరిమితవుతుందా, ఖమ్మంలోనూ పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. పోటీలో ఆ పార్టీ అభ్యర్థిని పెట్టకపోతే కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు కలిసొస్తాయన్న చర్చ జరుగుతోంది. ఇక సీపీఐ నేతలు జాతీయ నాయకత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా పోటీ చేయకపోతే కేడర్ బలహీనమవుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా తమ అడుగులు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment