సాక్షిప్రతినిధి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పయనంపై ఆ పార్టీల కేడర్‌లో అయోమయం నెలకొంది. బీఆర్‌ఎస్‌తో పొత్తుపై ఆ పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్‌ఎస్‌తో పొత్తుపై గట్టిగా మాట్లాడిన కమ్యూనిస్టు నేతలు ఇప్పుడు స్వరం తగ్గించారు. రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలా.. బీఆర్‌ఎస్‌తో పొత్తుతో వెళ్లాలా అనే ఆలోచనలు ఎటూ తెగడంలేదు.
పొత్తులు ఉన్నా, లేకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధిక సీట్లలో పోటీ చేయడంపై ఆయా పార్టీల నేతలు దృష్టి సారించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులిద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు కావడమే కాక రాష్ట్రంలోనే ఆ పార్టీలకు ఇక్కడ కొంత బలం ఎక్కువగానే ఉంది. ఇక పొత్తులపై బీఆర్‌ఎస్ నాన్చివేత ధోరణి అవలంబిస్తోందనే భావనకు వచ్చిన రెండు పార్టీల నేతలు ఈనెలాఖరు వరకు ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
కొలిక్కి రాకుండానే..
ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలతో బీఆర్‌ఎస్‌కు చెందిన నేత ఒకరు రాజధానిలో పొత్తుల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు, సీపీఐ కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్ స్థానాలను కోరినట్లు తెలిసింది. కాగా సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తామని సూత్రప్రాయంగా ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేకపోగా చర్చలు ఆగిపోయాయి. ఉభయ కమ్యూనిస్టులు మాత్రం తమకు బలం ఉన్న స్థానాలను కేటాయిస్తేనే పొత్తుకు సై అనే ఆలోచనలో ఉండగా.. విషయం తేలక కేడర్‌లో స్తబ్దత నెలకొంది.
కాలయాపనతో..
బీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహారంలో కాలయాపన జరిగితే తాము నష్టపోతామనే అభిప్రాయం సీపీఎం, సీపీఐ కేడర్‌లో వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్ ముందుకు రాకపోవడంతో పొత్తు అంశం తేలడం లేదనే చర్చ సాగుతోంది. పొత్తులకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎన్నికల సమయం వరకు వేచి ఉంటుందని భావిస్తుండగా, కమ్యూనిస్టులు బహిరంగంగా ప్రస్తావించడం లేదు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని బీఆర్‌ఎస్‌తో బ్రేకప్ కాలేదని, అన్నీ కుదిరితే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. పరస్పర ఓట్ల బదిలీ, సీట్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పొత్తు ఉంటుందని.. లేదంటే ఒంటరిగానే బరిలో దిగుతామని తెలిపారు. దీంతో కమ్యూనిస్టులు ఏదో ఒకటి త్వరగా తేల్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
20కి తగ్గేదే లే...
అధికార బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్నా.. లేకున్నా రాష్ట్రంలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉభయ కమ్యూనిస్టులు ఉన్నారు. ఈసారి అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలనే ఏకై క అజెండాతో ఆ పార్టీల అడుగులు వేస్తున్నాయి. ఒకవేళ బీఆర్‌ఎస్‌తో చర్చలు ఫలించకపోతే సీపీఎం, సీపీఐ కలిసి బరిలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చాయి.
ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి కనీసం ఏడు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాలపై ప్రధాన దృష్టి సారించాయి. అలాగే, రాష్ట్రంలోని మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, హుస్నాబాద్, ఇబ్రహీంపట్నం స్థానాలతోపాటు మరో ఏడు స్థానాల్లో తాము బలంగా ఉన్నట్లు ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఓవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుండగా.. కమ్యూనిస్టులు ఎటూ తేల్చుకోలేక.. ఎటు సాగాలో తెలియక ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వీడని పీఠముడి
ఇప్పటికే పొత్తులపై ఉభయ కమ్యూనిస్టులు, బీఆర్‌ఎస్ మధ్య పలుమార్లు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నా ఫలితం మాత్రం తేలలేదు. గతంలో పొత్తుపై అటు కమ్యూనిస్టులు, ఇటు బీఆర్‌ఎస్ నేతలు గట్టిగానే మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలోనూ సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అలాగే వర్షాలతో నష్టపోయిన పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట బోనకల్ మండలంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఉన్నారు. ఆ తర్వాత నుంచి పొత్తులపై బీఆర్‌ఎస్ వేచిచూసే ధోరణి అవలంబిస్తోందనే అభిప్రాయం కమ్యూనిస్టు పార్టీల కేడర్‌లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment