జిల్లాను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతాం..
ఖమ్మం నియోజకవర్గానికి ఆరువేల ఇళ్లు
రోడ్డుషోలో మంత్రులు పొంగులేటి, తుమ్మల
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్‌నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్‌లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.
నిరుపేదలందరికీ ఇళ్లు..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.
ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్‌రెడ్డిని తాకాలని సూచించారు.
మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment