అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర మంత్రి, ఖమ్మం పార్లమెంట్ ఇన్‌చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన వరుస భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం హాజరు కానున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
సత్తా చాటేలా..
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్.. హడావుడి ముగియగానే పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా జాతీయస్థాయిలోనూ సత్తా చాటాలని యోచిస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేడర్‌ను సమాయత్తం చేసేలా సన్నాహక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ నేపథ్యాన నేతలు, కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
కాంగ్రెస్‌కు అండగా..
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ గాలి వీచిన సమయంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని గెలుపు సాధించింది. ప్రతీ ఎన్నికల్లోనూ ఒకటి, రెండు సీట్లు మినహా.. కాంగ్రెస్, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలే విజయం సాధిస్తూ వచ్చాయి. అదే తరహాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్నప్పటికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రేణుకా చౌదరి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తీర్పు రాకుండా ఉండేలా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ, కొత్తగూడెంలో పొత్తుతో సీపీఐ విజయం సాధించడంతో.. లోక్‌సభ స్థానంలోనూ గెలుపు ఇక నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ భావిస్తోంది.
సన్నద్ధం!
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలను రాష్ట్ర మంత్రి, ఖమ్మం పార్లమెంట్ ఇన్‌చార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆయనతో పాటు మంత్రులు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ ఇచ్చిన హామీలు, అమలవుతున్న తీరు.. మిగతా హామీలు ఎప్పటి నుంచి అమలవుతాయనే అంశాలపై ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను కేడర్‌కు అవగాహన కల్పిస్తారు. అంతేకాక నియోజకవర్గాల వారీగా బలాబలాలపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లా ప్రత్యేకం..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలోనే బలీయమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికలతో మరింత పట్టు సాధించినట్లయింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరగా పార్టీకి సంస్థాగతంగా ఉన్న పట్టుకు వారి బలం కూడా తోడు కావడంతో తిరుగులేని విజయాన్ని కై వసం చేసుకుంది. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క ప్రభావం చూపించడంతో కాంగ్రెస్‌కు తిరుగులేకుండా పోయింది. ఇదే ఊపును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ముగ్గురు మంత్రులపై పడింది.
Comments
Please login to add a commentAdd a comment