బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా | JP Nadda Comments Development And Welfare Is Possible Only With BJP | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా

Published Tue, Apr 30 2024 12:55 PM | Last Updated on Tue, Apr 30 2024 12:55 PM

JP Nadda Comments Development And Welfare Is Possible Only With BJP

ఖమ్మం: పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్‌ భారత్‌ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. 

రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్‌ ద్వారా వంటగ్యాస్‌ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్‌లో కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోద్‌రావు, సీతారాంనాయక్‌ను గెలిపించాలని కోరారు.

దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు..
గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ వచ్చేది లేదని, రాహుల్‌ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసత్య  హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన చిప్ప పట్టుకొని రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్, రేవంత్‌ ఇద్దరూ  తోడు దొంగలేనని అన్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో  రాష్ట్రంలో 17 సీట్లనూ బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాయకుల మాయమాటలు నమ్మకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు మాట్లాడుతూ ఢిల్లీలో మాదిరి ఖమ్మం కాంగ్రెస్‌లోనూ కుటుంబపాలన సాగుతోందని, స్థానికేతరుడైన వియ్యంకుడిని మంత్రి పొంగులేటి తెచ్చి పెట్టారని ఆరోపించారు. స్థానికుడినైన తననే ఆదరింంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్‌ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ మాట్లాడుతూ తనను మరోసారి గెలిపిస్తే మహబూబాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, విజయరామారావు, ఎం.ధర్మారావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, నాయకులు శ్రీకాంత్, నంబూరి రామలింగేశ్వరరావు, జీవీకే మనోహర్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఉప్పల శారద, నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్రబాబు పాల్గొన్నారు.

ఇవి చదవండి: లెక్క తేలింది.. పోరు మిగిలింది..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement