కరీంనగర్: మోసపూరితమైన వాగ్ధానాలతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చె ప్పాలని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం గన్నేరువరంలో స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాముడి పేరుతో రాజకీయాలంటూ ఇరుపార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు.
మైనార్టీ ఓట్లు పొందడానికి ఇరు పార్టీలు ఆరాటపడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలే నరేంద్ర మోదీకి పెద్ద కుటుంబమని, ఆ కుటుంబం నుంచి ఎవరిని దూరం చేయలేరని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని పదేపదే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయని, కేంద్ర నిధులతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కనబడడం లేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 120రోజులు కావస్తున్నా ఇంతవరకు రైతుల రుణ మాఫీ ఎందుకు చేయలేదని, మహిళలకు రూ.2500 ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని బీజేపీ ప్రశ్నిస్తేనే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ మోసపోవద్దన్నారు. వివిధ పార్టీలకు చెందినవారు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, కోమల ఆంజనేయులు, నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్‌వర్మ, అనిల్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment