సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ నేతలు గంపెడాశతో ఉన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు పొందడం కోసం ఆశావహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను రద్దు చేయగా.. జిల్లాస్థాయిలోనూ పలు పదవులను భర్తీచేయాల్సి ఉంది. ఈ నేపథ్యాన లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఆలోపే పదవులు భర్తీచేస్తారా, ఎన్నికల తర్వాతే పదవుల పందేరం ఉంటుందా అనే సందిగ్ధంలో ఆశావహులు ఉన్నారు. అయితే, పదవులు ఎప్పుడు భర్తీ చేసినా తమకే దక్కేలా నేతలు లాబీయింగ్‌లో నిమగ్నమయ్యారు.'
రాష్ట్రస్థాయి పదవులే లక్ష్యం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు మిత్రపక్షమైన సీపీఐతో కలిసి కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను దక్కించుకుంది. అలాగే మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యాన జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది.
ఈ ముగ్గురు నేతల అనుచరుల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నేతలు ఉండగా.. పార్టీ అధికారంలోకి రావడంతో వీరంతా రాష్ట్రస్థాయి పదవులనే ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కూడా జిల్లాకు చెందిన కొండబాల కోటేశ్వరరావు కు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బొర్రా రాజశేఖర్‌కు మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్, పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. దీంతో కాంగ్రెస్ హయాంలో కూడా జిల్లా నేతలకు రాష్ట్రస్థాయి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది.
జిల్లాస్థాయిలోనూ..
ఇక జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఏమీ లేదు. ఓ పక్క రాష్ట్రస్థాయి పదవుల కోసం ప్రయత్నిస్తూనే అది దక్కకపోతే ఉమ్మడిజిల్లా, జిల్లాస్థాయి పదవులు దక్కించుకోవాలనే వ్యూహంతో పలువురు నేతలు ఉన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా పదవి పొందాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేసిన నాటి నుంచే ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 వ్యవసాయ మార్కెట్లతో పాటు ఆలయాల పాలకవర్గాలు, ఇతర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది.
త్వరలోనే లోక్‌సభ నోటిఫికేషన్!
మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణాన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే యత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను రద్దు చేయగా.. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులను కట్టబెట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. దీంతో త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని పలువురు భావించగా.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తి కావొస్తున్నా అడుగులు పడలేదు.
మొదట్లో లోక్‌సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఎన్నికల తర్వాత జరుగుతుందా అనే మీమాంస నెలకొంది. ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే పదవులు రాని వారు పార్టీ అభ్యర్థుల తరఫున పనిచేయరనే భావనతో కొంతకాలం ఆపుతారని ప్రచారం జరుగుతుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
జాబితా పెద్దదే..
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ప్రధాన అనుచరులుగా ఉన్న నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారు. భట్టికి ప్రధాన అనుచరులుగా మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో పాటు రాయల నాగేశ్వరరావు, నాగా సీతారాములు, పువ్వాళ దుర్గాప్రసాద్, జావీద్ కొనసాగుతున్నారు.
అలాగే పొంగులేటికి బొర్రా రాజశేఖర్, మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మద్దినేని బేబిస్వర్ణకుమారి, మేకల మల్లిబాబు, తుమ్మలకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణ అనుచరులుగా ఉన్నారు. ఇందులో కొందరు నామినేటెడ్, మరికొందరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం.
ఇవి చదవండి: బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం! మంత్రి కొండా సురేఖ
Comments
Please login to add a commentAdd a comment