ధర్మసాగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న నవ్య
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మధ్య వేధింపుల పంచాయితీ చినికిచినికి గాలివానగా మారి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యేతోపాటు తన భర్త ప్రవీణ్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌లపై బుధవారం సాయంత్రం ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య స్పష్టం చేశారు. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య.. గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైసా ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రూ.100 బాండ్ పేపర్‌పై అప్పుగా రూ.20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టాలని ఎమ్మెల్యేతోపాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలు వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తన భర్తపై కూడా ఆరోపణలు చేసిన నవ్య.. ఆయనతో కలిసే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
డబ్బు ఆశచూపి నా భర్తను ట్రాప్ చేశారు..
సర్పంచ్ నవ్య.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు. ‘జానకీపురం గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తున్న నన్ను ఎమ్మెల్యే రాజయ్య కొంతకాలంగా వేధిస్తున్నారు. గతంలో నా భర్త ప్రవీణ్ కుమార్ ద్వారా నన్ను బలవంతగా ఒప్పించి, రాజీపడే విధంగా చేసి.. ఎమ్మెల్యే రాజయ్య స్వయంగా మా ఇంటికి వచ్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. మీడియా ముఖంగా జానకీపురం గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులనుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన మాటలను నమ్మి రాజీపపడ్డాం.
కానీ నేటికీ ఎలాంటి నిధులు మంజూరు చేయకపోగా రూ.25 లక్షలు మాకే ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం ఎమ్మెల్యే చేయించాడు. నెలరోజుల కింద నా భర్త ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాస్ గ్రామానికి నిధులు ఇస్తామని నన్ను హనుమకొండకు రప్పించి నా దగ్గరికి రెండు అగ్రిమెంటు పేపర్లను తీసుకువచ్చారు. ఒకటి గతంలో ఎమ్మెల్యేపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమని, నేను తప్పుగా రాజకీయ లబ్ధి కోసం వాటిని చేసినట్లు ఒప్పుకున్నట్టుగా స్టాంపు పేపరుపైన రాయించుకొచ్చారు.
మరో పేపర్‌పై రూ.20 లక్షలు నాకు అప్పుగా ఇచ్చినట్లు, తిరిగి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే విధంగా ఒప్పుకున్నట్లు రాసుకొని వచ్చారు. వాటిపై సంతకం పెట్టాలని బలవంతం చేశారు. దీనిని నేను వ్యతిరేకించా. డబ్బు ఆశచూపి నా భర్తను ట్రాప్ చేసి, సంతకం పెడితేనే గ్రామానికి ఒప్పుకున్న నిధులు రూ.25 లక్షలు మంజూరు చేస్తామని వేధింపులకు గురి చేస్తున్నారు.
మార్చి 8న జరిగిన వేధింపుల ఘటనలో మధ్యవర్తిత్వం వహించిన ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత ఆ రోజు క్షమించమని ప్రాధేయపడితే.. పోనీ, ఎవరి పాపం వారిది అని పేరు బయట పెట్టలేదు. అయినా నా భర్తకు డబ్బు ఆశచూపి ఒప్పంద పత్రంపై సంతకం చేయించడానికి పన్నాగం పన్నారు. నిజాయితీగా ఉండాలనుకున్న నేను సంతకం చేయకపోవడంతో వేధింపులకు గురి చేస్తున్నందున ఎమ్మెల్యే, ఆయన పీఏ, ఎంపీపీ, నా భర్తపైనా చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నా’అని ఫిర్యాదులో వివరించారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు..
భర్తతో కలసి నవ్య ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ధర్మసాగర్ పోలీసులు, బుధవారం రాత్రి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఎమ్మెల్యే, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలతో పాటు తనభర్తపైనా నవ్య చేసిన ఫిర్యాదులో ఎఫ్‌ఐఆర్ కంటెంట్ లేనందున కేసు నమోదు చేయలేదని, న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత చర్యలు చేపడతామని ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment