-ఆందోళనతో ఏర్పడే ఇబ్బందులకు ప్రభుత్వానిదే బాధ్యత
-టీ టఫ్ రాష్ట్ర చైర్మన్ పద్మారెడ్డి, కన్వీనర్ శ్రీధర్
హన్మకొండ (వరంగల్ జిల్లా) : విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు జూన్ 15 నుంచి సమ్మె చేయనున్నట్లు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్(టీ టఫ్) రాష్ట్ర చైర్మన్ ఎన్.పద్మారెడ్డి, కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ చెప్పారు. శుక్రవారం హన్మకొండలో వారు విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత నెల 13న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి టీటఫ్ ప్రతినిధులతో చర్చలు జరిపారని, తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరామని అన్నారు. అయితే నెల రోజులు దాటినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 19న విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇచ్చామన్నారు.
జూన్ 15లోపు సమస్యలు పరిష్కరించకుంటే ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రంలోని 40 వేల మంది విద్యుత్ రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులంతా సమ్మె చేస్తారని హెచ్చరించారు. తమ ఆందోళనతో విద్యుత్ వినియోగదారులకు కలిగే అంతరాయూనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 31 నుంచి జూన్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె సన్నాహక సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 31న సిద్దిపేట, తూఫ్రాన్. జూన్ 1న భువనగిరి, జనగామ. సూర్యాపేట. 3న సత్తుపల్లి, కేటీపీఎస్ కొత్తగూడెం, 4న మహబూబాబాద్, కేటీపీపీ ములుగు. 7న కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్. 8న మంచిర్యాల, పెద్దపల్లి, హుజురాబాద్. 10న గద్వాల, వనపర్తి, జడ్చెర్ల. 11న రంగారెడ్డి, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. అనంతరం సమ్మె పోస్టర్లు విడుదల చేశారు.
జూన్ 15 నుంచి కరెంటోళ్ల సమ్మె
Published Fri, May 27 2016 7:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM
Advertisement
Advertisement