మెుక్కల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
Published Sat, Aug 13 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
హన్మకొండ అర్బన్l: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులతో హరితహారం, విద్యాశాఖ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో 1.75 లక్షల మొక్కలు నాటామని, బాలల హరితహారం ద్వారా పిల్లలకు 2 లక్షల మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. పిల్లలకు ఇచ్చిన మొక్కల సంరక్షణపై అధికారులు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. నాన్ ఈజీఎస్ కింద నాటిన మొక్కలకు నీరు పోయడం, ఫెన్సింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుపుతూ సంబంధిత అధికారి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఒక్కో మొక్క ఫెన్సింగ్‌కు రూ.9, నీరు పోసేందుకు రూ.120 మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
విద్యకు అధిక ప్రాధాన్యం...
పిల్లల విద్యా, వివాహ విషయాల్లో తలిదండ్రులు రాజీ పడటం లేదని, ఈ విషయం గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్తమ విద్య అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, సర్దుబాటులో భాగంగా ఇతర ప్రాంతాలకు కేటాయించగా, విధుల్లో చేరని వారి వివరాలు అందజేయాలని డీఈఓను ఆదేశించారు. ఎంఈఓలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఆంగ్ల బోధనపై ప్రభుత్వ టీచర్లకు వచ్చే నెలలో శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో డీఈఓ రాజీవ్, డ్వామా ఏపీడీ శ్రీనివాస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement