వరంగల్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల రేసు మొదలైంది. శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుండడంతో ఆశావహులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. సుమారు వారం రోజులపాటు స్వీకరించే ఈ దరఖాస్తుల కోసం ఉమ్మడి వరంగల్‌నుంచి పలువురు పోటీ పడుతున్నారు. ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలు మినహా పది చోట్ల టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వచ్చే నెల మొదటి వారంలోనే పీఈసీ సమావేశంలో దరఖాస్తులను పరిశీలించే అవకాశం ఉన్నందున టీపీసీసీ ఈ నెల 18 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించింది. దీంతో ఆశావహులు పోటాపోటీగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రెండింట్లోనే ఒక్కొక్కరు.. మిగతా చోట్ల పోటాపోటీ..
ఉమ్మడి వరంగల్‌లో ములుగు, భూపాలపల్లి జిల్లాలనుంచి పోటీ లేదు. ములుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, భూపాలపల్లినుంచి గండ్ర సత్యనారాయణలు పోటీ చేయనుండగా.. మిగతా చోట్ల పోటాపోటీగా దరఖాస్తులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
► వర్ధన్నపేట నుంచి బరిలో దిగేందుకు పలువురు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నియోజకవర్గ సమన్వయకర్త నమిండ్ల శ్రీనివాస్‌ల మధ్య టికెట్ పోరు తారస్థాయికి చేరగా.. తాజాగా మాజీ పోలీసు అధికారి కె.ఆర్.నాగరాజు ఈ నియోజకవర్గంపై కన్నేశారు. ఇటీవల పార్టీలో చేరిన ఆయన దూకుడుగా ఉన్నారు. దొమ్మాటి సాంబయ్య కూడా టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో ప్రచారం ఉంది.
► వరంగల్ తూర్పు నియోజకవర్గంనుంచి గెలిచిన కొండా సురేఖ మళ్లీ పోటీ చేసేందుకు సన్నద్ధమవుతుండగా.. ఆమెకు దాదాపుగా టికెట్ ఖాయమన్న ప్రచారం ఉంది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఇక్కడినుంచి టికెట్ ఆశిస్తున్నారు.
► వరంగల్ పశ్చిమలో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పోటీ చేస్తానంటూ పదేపదే ప్రకటించడంతోపాటు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, గతంలో పాలకుర్తినుంచి పోటీచేసి ఓడిపోయిన జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించి కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు వేం నరేందర్‌రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది.
► జనగామ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలు ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోరు తారస్థాయికి చేరగా.. ఇటీవల కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంపై పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వీరిద్దరు విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్నారు.
► పాలకుర్తిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి ఈసారి వరంగల్ పశ్చిమపై దృషి్‌ట్ సారించడంతో పాలకుర్తి నుంచి కొత్తవారి పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ ధన్వంతి భర్త టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పేరు ప్రచారంలో ఉంది. తాజాగా పారిశ్రామికవేత్త, ఎన్‌ఆర్‌ఐ హనుమండ్ల ఝాన్సీరెడ్డి రంగ ప్రవేశం చేసి నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
► పరకాలలో గతంలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సైతం పరకాల నుంచి అవకాశం ఇస్తే బరిలో నిల్చుంటానంటూ వెల్లడించారు. ఇదే సమయంలో రెండు నెలల కిందట వరంగల్‌లో కొండా, ఇనుగాల వర్గీయుల మధ్య గొడవ కూడా జరిగింది. ఈ ఇద్దరికీ తోడు కొత్తగా బీజేపీలో సీనియర్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారి పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటున్నారు.
► డోర్నకల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్, నెహ్రూనాయక్, నునావత్ భూపాల్ నాయక్‌లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కొంతకాలంగా రెండు వర్గాలుగా ఏర్పడి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాంచంద్రునాయక్ 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. నెహ్రూనాయక్, మరో యువనేత, ఎన్‌ఆర్‌ఐ నానావత్ భూపాల్‌నాయక్‌లు మొదటిసారి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ముగ్గురు దరఖాస్తు చేసుకోనున్నారు.
► మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, డాక్టర్ భూక్యా మురళీనాయక్‌లు పోటీపడుతున్నారు. ఇటీవల బలరాంనాయక్, బెల్ల య్యనాయక్ కలిసి ఒకే వేదికగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ప్రకటించారు. మురళీనాయక్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డిపై భరోసాతో ఉన్నారు.
► నర్సంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఊరూరా జోడోయాత్ర కూడా చేశారు. గతంలో కాంగ్రెస్‌నుంచి పోటీ చేసిన కత్తి వెంకటస్వామి సైతం ఇక్కడినుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఓ బీజేపీ సీనియర్ నేత పేరు కూడా వినిపిస్తోంది.
► గతంలో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య ఈసారి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంనుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సింగారపు ఇందిర కూడా ఈసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు దరఖాస్తు చేసుకోనుండగా.. జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పార్టీ మారితే కాంగ్రెస్ టికెట్ అడగవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment