వరంగల్: ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పార్టీలో కొందరు ఆశావహుల తీరు. ఆగస్టు 18 నుంచి 25 వరకు అసెంబ్లీ స్థానాల వారీగా ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్టానం దరఖాస్తులు స్వీకరించింది. డీసీసీ, టీపీసీసీ, ఎన్నికల నిర్వహణ కమిటీలో పరిశీలన పూర్తయిన అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) కూడా పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు అధిష్టానం ప్రకటించింది.
ఇదంతా సుమారు 15–20 రోజుల పాటు జరిగే ప్రక్రియ. అయితే ఓ వైపు ఆ తంతు సాగుతుండగానే.. నియోజకవర్గస్థాయి సదస్సుల్లో చాలాచోట్ల ఆశావహ నేతలు బలప్రదర్శనకు దిగడం వివాదాస్పదం అవుతోంది. మీసాలు మెలేయడం.. తొడలు కొట్టుకోవడం క్యాడర్‌ను అయోమయంలో పడేస్తుండగా.. వర్గాల పోరు రోజురోజుకూ రాజుకుటోంది. ఇటీవల వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఆశావహ నేతలు పార్టీ కేంద్ర పరిశీలకుల ఎదుటే బలప్రదర్శనకు దిగారు. దీంతో రసాభాసగా ముగిసిన సమావేశాలపై టీపీసీసీ, ఏఐసీసీలు ఆరా తీస్తుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కుమ్ములాటలు.. కొట్లాటలు
ఉమ్మడి వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మూడు కుమ్ములాటలు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా తయారైంది. వరంగల్ జిల్లా కేంద్రంలోనే కాదు ఎనిమిది నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నా యి. వరంగల్ పశ్చిమ నుంచి 2018లో ఆశించి భంగపడ్డ నాయిని రాజేందర్‌రెడ్డికి ఈసారి దాదాపు టికెట్ ఖాయమన్న అధిష్టానం సంకేతాలతో పని చేస్తున్నారు. గతంలో పశ్చిమ కోసం నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మధ్య పోటీ ఉండేది. దీంతో ఆ ఇద్దరి నేతల మధ్యన వర్గపోరు చాలానాళ్లు సాగగా స్వర్ణ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు కావడంతో ఆమె తూర్పు నియోజకవర్గంవైపు మారారు.
కొత్తగా జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పశ్చిమ టికెట్‌పై గురి పెట్టడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల హన్మకొండ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్లమెంట్ ఇన్‌చార్జ్ దాల్వి సమక్షంలోనే పోటాపోటీ నినాదాలతో బలప్రదర్శనకు దిగ డం చర్చనీయాంశమైంది. తూర్పు నియోజకవర్గం కొండా సురేఖకు ఖాయమనుకున్న సమయంలో ఇక్కడి నుంచి ఎర్రబెల్లి స్వర్ణ కూడా దరఖాస్తు చేసుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఢిల్లీ నుంచి హాజరైన పార్లమెంటు ఇన్‌చార్జ్ రవీంద్ర ఉత్తమ్‌రావు దాల్వి, రాష్ట్ర పార్టీ నుంచి శోభారాణి తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న కేఆర్.నాగరాజు, నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. కాగా వేదిక పైకి నాగరాజును పిలవడంతో నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో అరగంట పాటు సమావేశం స్తంభించగా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళానికి దారి తీసింది. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు మొత్తం పది మంది దరఖాస్తు చేసుకున్నారు.
పరాకాష్టకు పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్..
పరకాల నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశం కూడా రసాభాసగా జరిగింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండా మురళీధర్‌రావులు పరిశీలకుల ముందే బాహాబాహీకి దిగారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇది నా అడ్డా అంటూ మీసం తిప్పగా.. ఇనగాల వెంకట్రామిరెడ్డి ఇది నా అడ్డా అంటూ తొడ గొట్టడం వివాదాస్పదం అయ్యింది. ఈ సమావేశానికి హాజరైన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు రెండుగా చీలిపోగా.. కొండా, ఇనుగాల వర్గీయులు పరస్పరం దుర్భాషలాడుకోవడం, తోపులాటకు దిగిన ఘటనలపై అధిష్టానం ఆరా తీస్తున్నది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సైలెంట్‌గా కొనసాగిన వర్గ రాజకీయాలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి.
ఇటీవల నిర్వహించిన నియోజకవర్గం స్థాయి సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య అనుచరులు రెండు వర్గాలుగా ఏర్పడి నేతలకు అనుకూలంగా నినాదాలు చేయడం, ఒకరికొకరు నెట్టివేసుకోవడం, పరస్పరం దాడి చేసుకోవడం వరకు వెళ్లింది. వీరితోపాటు మరో ఆరుగురు ‘స్టేషన్’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. జనగామ నియోజకవర్గంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా మారింది. ఈ రెండు వర్గాల పంచాయితీ పలుమార్లు గాంధీభవన్‌కు కూడా చేరింది.
Comments
Please login to add a commentAdd a comment