వరంగల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు మలిదశకు చేరింది. త్వరలోనే ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 53మంది వివిధ స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు.
టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీలు ఆ దరఖాస్తులను పరిశీలించి జిల్లా కాంగ్రెస్ కమిటీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రెండు రోజుల్లో సీడబ్ల్యూసీ, పార్టీ కేంద్ర ఎన్నికల పరిశీలన కమిటీకి పంపనున్నారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనే వారినే ఈసారి బరిలోకి దింపే ఆలోచనలో ఉన్న అధిష్టానం.. ఆశావహుల జాబితాపై త్వరలోనే తుదినిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది.
భూపాలపల్లి, ములుగుకు ఒక్కొక్కటి..
మిగతా చోట్ల పోటాపోటీ..
ఈ నెల 18న మందకొడిగా సాగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియ.. మూడు రోజులుగా పోటెత్తింది. ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముఖ్య నాయకులంతా గురు, శుక్రవారాల్లో తమ దరఖాస్తులను హైదరాబాద్ గాంధీభవన్‌లో దాఖలు చేశారు. శుక్రవారం రాత్రి వరకు పార్టీ వర్గాల సమాచారం మేరకు 53 మంది ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున దరఖాస్తు చేసుకోగా.. నర్సంపేట నుంచి రెండు దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యధికంగా వర్ధన్నపేట నుంచి పదకొండు మంది వరకు పోటీ పడుతున్నారు. 12 నియోజకవర్గాలనుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు దరఖాస్తు చేసుకున్నారు.
ఓవర్ టు హైదరాబాద్.. ఆశావహుల ఢిల్లీబాట
వారం రోజుల్లోపే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆశావహులు పలువురు అప్పుడే ఢిల్లీబాట పట్టారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసే వరకు హైదరాబాద్‌లోనే మకాం వేసిన పలువురు నేతలు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు పయనం అయ్యారు. కొందరు డీసీసీ నేతలను, మరికొందరు టీపీసీసీ పెద్దలను వెంటబెట్టుకుపోగా.. మరికొందరు ఏకంగా ఏఐసీసీ పెద్దలతోనే లాబీయింగ్ చేస్తుండడం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో వేడిని పెంచింది.
నియోజకవర్గాల వారీగా దరఖాస్తుదారుల వివరాలు..
వరంగల్ తూర్పు: కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ, ఎంబాడి రవీందర్, అజ్మతుల్లా హుస్సేనీ
వరంగల్ పశ్చిమ: నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, కట్ల శ్రీనివాస్, రేపల్లె శ్రీనివాస్, తక్కళ్లపల్లి సారిక, రేపల్లె రంగనాథ్
జనగామ: కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రమళ్ల సుధాకర్, గిరి కొండల్‌రెడ్డి
పాలకుర్తి: అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, బండి సుధాకర్‌గౌడ్, అనుమాండ్ల తిరుపతిరెడ్డి, డా.లక్ష్మీనారాయణనాయక్
పరకాల: ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావు, అవేలి దామోదర్, కట్కూరి దేవేందర్ రెడ్డి, బొమ్మతి విక్రమ్
మహబూబాబాద్: బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్ భుక్యా మురళినాయక్, నునావత్ రాధ, నునావత్ రమేశ్, దస్రునాయక్.
స్టేషన్ ఘన్‌పూర్: దొమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిర, చేపూరి వినోద్, డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ, గంగారపు అమృతరావు, డాక్టర్ రాజమౌళి
డోర్నకల్: జాటోత్ రాంచంద్రు నాయక్, మాలోత్ నెహ్రూ నాయక్, ననావతు భూపాల్ నాయక్
ములుగు: ధనసరి సీతక్క
భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ రావు
నర్సంపేట: దొంతి మాధవరెడ్డి, కత్తి వెంకటస్వామి
వర్ధన్నపేట: నమిండ్ల శ్రీనివాస్, కేఆర్ నాగరాజు, బక్క జడ్సన్, సిరిసిల్ల రాజయ్య, సుంచు రవి, బందెల భద్రయ్య, పులి అనిల్, ఆనంద్‌కుమార్, నరుకుడు వెంకటయ్య, యాక స్వామి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment