TS Warangal Assembly Constituency: 'సీఎం కేసీఆర్‌ది పటిష్టమైన విజన్‌!' : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
Sakshi News home page

'సీఎం కేసీఆర్‌ది పటిష్టమైన విజన్‌!' : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Published Thu, Sep 7 2023 1:16 AM | Last Updated on Thu, Sep 7 2023 1:44 PM

- - Sakshi

వరంగల్‌: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ పటిష్టమైన విజన్‌తో ముందుకు పోతున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గుంటూరుపల్లిలో రూ.3.10 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, కాపులకనిపర్తిలో రూ. 8.18 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, గ్రామపంచాయతీ భవనం, రైతు వేదికను బుధవారం ప్రారంభించారు.

గవిచర్లలో రూ.14.19 కోట్లతో నిర్మించిన మహిళా భవనం, గ్రామపంచాయతీ భవనం, కమ్యూనిటీహాల్‌ ప్రహరీ, సీసీ రోడ్లను ప్రారంభించి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పంట నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్‌, కేసీఆర్‌ అన్నారు. నాడు బోరు బావులు తవ్వినా నీటి చుక్క ఉండేది కాదని, కాళేశ్వరం నీరు చెరువులు కుంటల్లోకి వస్తుండడంతో భూగర్భ జలమట్టం పెరిగి భూముల ధరలు పెరిగాయన్నారు. కాపులకనిపర్తి జీపీ భవనం అద్భుతంగా నిర్మించారని, ఇదే మాదిరిగా ఇతర గ్రామాల్లో నిర్మించుకోవాలని సూచించారు. స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలకు రూ.20 లక్షల విరాళం..
కాపులకనిపర్తి సర్పంచ్‌ ఎర్రబెల్లి గోపాల్‌రావు ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం రూ.20 లక్షలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల ఇరుకుగా ఉందని, ఆటస్థలం లేదన్నారు. నూతన పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌ ప్రావీణ్య, డీఆర్‌డీఓ సంపత్‌రావు, జేడీఏ ఉషాదయాళ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజేశ్వరి, గోపాల్‌రావు, రమ, జయశ్రీ, ఎంపీటీసీలు బాలకృష్ణ, సంపత్‌రెడ్డి, రజిత పాల్గొన్నారు.

విద్యార్థిని అభినందించిన మంత్రి..
పర్వతగిరి మండలంలోని దౌలత్‌నగర్‌ గ్రామానికి చెందిన పేద విద్యార్థి పిండి విశాల్‌ పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లోని నిట్‌లో సీటు సాధించాడు. ఈ సందర్భంగా పర్వతగిరిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని బుధవారం విశాల్‌ మర్యాదపూర్వకంగా కలిశాడు. బాగా చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి విశాల్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ సర్వర్‌, సర్పంచ్‌ కొల్లూరి వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు చింతపట్ల నాగేశ్వర్‌రావు, దొనికి కొమురయ్య, గడల రాజు, మాలోతు రవీందర్‌, పిండి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement