సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించి వెళ్లిన కేంద్ర ఎన్నికల కమిషన్.. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుందన్న ప్రచారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. జనగామ వివాదానికి కార్పొరేషన్ పదవి కట్టబెట్టడం ద్వారా చెక్ పెట్టింది. కాగా, దరఖాస్తు చేసుకుని నెల రోజులు గడుస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించని పరిస్థితి.
క్లియర్‌గా ఉన్న స్థానాలపైనా స్పందించడం లేదన్న చర్చ ఉంది. ఇంకోవైపు బీజేపీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆ పార్టీ అధిష్టానం సైతం అభ్యర్థులను ప్రకటించడంలో వెనుకబడింది. దీంతో గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఆ రెండు పార్టీల నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్తబ్దుగా ఉన్నారు. టికెట్లు ప్రకటించిన తరువాతే రంగంలోకి దిగుదామనే ధోరణితో ఆ రెండు పార్టీల కేడర్‌లోనూ కొంత స్తబ్దత నెలకొంది.
ఆ రెండు పార్టీల కేడర్‌లో నిస్తేజం..
సెప్టెంబర్ 25 నాటికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం క్లియర్‌గా ఉన్న స్థానాలకు మొదటి విడత జాబితాగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఆ రెండు పార్టీల అధిష్టానాలు ప్రకటించాయి. తర్వాత స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 5వ తేదీ వరకై నా కొన్నింటికి పేర్లు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. కానీ, ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఆ రెండు పార్టీల కేడర్‌లో ‘ఎప్పుడు ఇంతే..’నన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పరంగా చూస్తే ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు నేతలు టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు.
ఇప్పటి వరకు ములుగు, భూపాలపల్లి, పాలకుర్తి, నర్సంపేట, వరంగల్ తూర్పుల విషయంలో ధనసరి సీతక్క, గండ్ర సత్యనారాయణ, అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖల పేర్లపై స్పష్టత వచ్చినట్లు చెబుతున్నా.. అధికారిక ప్రకటన లేదు. వరంగల్ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, జనగామలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, పరకాలకు కొండా మురళీధర్‌రావు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, డోర్నకల్ నుంచి రాంచంద్రునాయక్, నెహ్రూనాయక్‌లు, మహబూబాబాద్ నుంచి మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్, భూక్యా మురళీనాయక్, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి శనిగరం ఇందిర, దొమ్మాటి సాంబయ్యలు టికెట్ల కోసం పోటీపడుతున్నారు.
బీజేపీలోనూ టికెట్ల పోరు రోజురోజుకూ పెరుగుతోంది. వరంగల్ పశ్చిమ నుంచి రావు పద్మ, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావులు, తూర్పు నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, గంట రవికుమార్, కుసుమ సతీశ్, నర్సంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎర్రబెల్లి మదన్‌మోహన్‌రావులు టికెట్ రేసులో ఉన్నారు. భూపాలపల్లి నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి, కటంగూరి రాంనర్సింహారెడ్డి, వర్ధన్నపేట నుంచి కొండేటి శ్రీధర్, జన్ను మధు, జనగామ నుంచి ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీ ఎల్‌ఎన్ రెడ్డిల పేర్లు ఫైనల్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
మహబూబాబాద్ నుంచి జాటోతు హుస్సేన్ నాయక్ పేరు ఫైనల్‌కు చేరగా, డోర్నకల్ నుంచి లక్ష్మణ్‌నాయక్, నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యురాలు సంగీత, పరకాల నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, డాక్టర్ కాళీ ప్రసాదరావు, పాలకుర్తి నుంచి లేగ రామ్మోహన్‌రెడ్డి, కర్ర శ్రీని వాసరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు, బొజ్జపల్లి సుభాష్, ములుగు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన మాజీమంత్రి చందూలాల్ కుమారుడు అజ్మీర ప్రహ్లాద్, కృష్ణవేణి నాయక్‌ల పేర్లపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రోజు రోజుకూ జరుగుతున్న జాప్యంతో ఎప్పటికీ అభ్యర్థుల జాబితా వెలువడుతుందన్న అసహనం ఆశావహులు, కేడర్‌లో కనిపిస్తోంది.
దూకుడు పెంచిన బీఆర్‌ఎస్ అభ్యర్థులు..
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న సమాచారం మేరకు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తే.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం కుదరదు గనక ఆ పార్టీ నేతలు పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లతో కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తున్నారు.
పథకాల పేరుతో ఓటర్లను కలుస్తున్నారు. నెల కిందటే బీఆర్‌ఎస్ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి వరంగల్‌లో 12 నియోజకవర్గాలుంటే అందులో జనగామకు అభ్యర్థిని ప్రకటించకపోగా, ప్రకటించిన స్టేషన్‌ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే డా.టి.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య కుదరని సయోధ్య అధిష్టానానికి కొంత తలనొప్పిని కలిగించింది.
రెండు రోజుల కిందట యాదగిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మన్, రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్ పదవులను కట్టబెట్టి సమస్యకు చెక్‌పెట్టింది. నేడే, రేపో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని జనగామ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించనుండగా, ఉమ్మడి వరంగల్‌లో అన్ని స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు చేసినట్లు అవుతుంది. ఇప్పటికే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు షెడ్యూల్ తర్వాత మరింత దూకుడు పెంచేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment