
సాక్షి, జనగామ: స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ హాట్ కామెంట్‌తో వార్తల్లోకెక్కారు. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనో వేదన చెందుతున్నారు.
ధర్మసాగర్ మండలంలో బీసీ బంధు.. లక్ష రూపాయల చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. ఆ సమయంలో పక్కన ఉన్న అనుచరులు సైతం నవ్వులు చిందించారు.
దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు... రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు. తాజా కామెంట్లు ఆయన పార్టీ మారరనే సంగతి స్పష్టం చేస్తున్నా.. ఆయన కార్యచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment