వికారాబాద్: మండల పరిధిలోని గ్రామాల్లో కారు, హస్తం నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రచారానికి ఆరు రోజుల సమయమే ఉంది. కానీ బీజేపీ, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు నేటికీ మండలంలో ప్రచారం ప్రారంభించలేదు.
‘హస్త’గతం చేసుకునేందుకు ప్రసాద్‌కుమార్
నియోజకవర్గంపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు మాజీ మంత్రి, పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 18న ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే ఆయన పది గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. 21న తిరిగి ప్రచారం ప్రారంభించిన గడ్డం 11 గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇక ఒక్క గ్రామంలో ప్రచారం నిర్వహిస్తే ఆయన మండల పర్యటన పూర్తవుతుంది. ఆయన ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటుగా మేనిఫెస్టోను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయన ప్రచా రానికి ఏఐసీసీ సభ్యులు సైతం విచ్చేసి స్నేహ హస్తం అందిస్తున్నారు. నిరుద్యోగులపై ప్రభు త్వం నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ యువతను ఆకర్శించే యత్నం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌లపై వ్యక్తిగత విమర్శలు చేస్తుండడంతో ఒకింత విమర్శలను ఎదుర్కుంటున్నారు.
మళ్లీ ఆశీర్వదించాలని ఆనంద్
ప్రచారం ప్రారంభించిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మొదటి విడతలో నాలుగు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన ప్రచారంలో మరో నాలుగు గ్రామాలను చుట్టేశారు. కాగా పది గ్రామాల్లో ఇంకా ఆనంద్ ‘కారు’ తిప్పాల్సింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని తనదైన శైలిలో వివరిస్తూ ఓటర్లను జారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
భగీరథ తాగునీరు, 24గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు, బీమా, రుణమాఫీ, దళారులు లేని పంటల కొనుగోళ్లు, పరిశుభ్రమైన పల్లెలు తదితర అంశాలను వివరిస్తూ వ్యతిరేక ఓటరులు ఇతర పార్టీల వైపు చూడకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి అగం కావద్దని తెలియజేస్తూ మరో సారి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.నియోజకవర్గ ఏర్పాటు నుంచి మోమిన్‌పేటలో మెజార్టీ సాధించిన వారే అసెంబ్లీ నుంచి గెలుపొందుతున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలకు పట్టం కట్టిన ఓటర్లు గత రెండు ఎన్నికల్లో ‘కారు’కు జైకొట్టారు. దీంతో ఇక్కడ అధిక ఓట్లను రాబట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు చెమటోడుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment