కొడంగల్: కొడంగల్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రాంత ఓటర్లు ఆరు సార్లు హస్తానికి పట్టం కట్టారు. ఆ తర్వాత టీడీపీ ఐదు సార్లు విజ యం సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. 2018 ఎన్నికల్లో హోరా హోరీ పోరులో టీఆర్‌ఎస్ గెలిచింది. ప్రస్తుత ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మధ్య పోటాపోటీగా జరుగుతున్నాయి. ఇక్కడి ఓటర్ల నాడి నాయకులకు అంతుపట్టక ఆగమవుతున్నారు.
ఒక్కసారి మంత్రి పదవి
నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే కొడంగల్‌కు మంత్రి పదవి వరించింది. పీఎన్‌ఆర్ గెలిచిన నాటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన గెలిస్తే మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గీయులు ఆశిస్తున్నారు. నరేందర్‌రెడ్డి మంత్రి పదవి చేపడితే తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని జిల్లా నేతలు భావిస్తున్నట్లు వినికిడి. 1956లో నియోజకవర్గం ఏర్పడగా నాటి నుంచి 2018 సార్వత్రిక ఎన్నికల వరకు కొడంగల్ అసెంబ్లీ స్థానానికి 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి.
అందులో ఆరు పర్యాయాలు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ, మూడు సార్లు స్వతంత్రులు, ఒకసారి టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. 1957లో తొలి ఎమ్మెల్యేగా అచ్యుతారెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 1962లో రుక్మారెడ్డి, 1972లో నందారం వెంకటయ్య, 1978లో గురునాథ్‌రెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే గురునాథ్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. 1983లో టీడీపీ ప్రభంజనలోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా గురునాథ్‌రెడ్డి గెలిచారు.
1985, 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి నందారం వెంకటయ్య అసెంబ్లీ మెట్లెక్కారు. ఎమ్మెల్యేగా ఉండగానే నందారం వెంకటయ్య చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. 1996లో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ నుంచి నందారం వెంకటయ్య రెండో కువూరుడు సూ ర్యనారాయణ టీడీపీ నుంచి గెలిచారు. 2004 లో గురునాథ్‌రెడ్డి, 2009, 2014లో రేవంత్‌రెడ్డి, 2018లో పట్నం నరేందర్‌రెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీలు తమకు కంచుకోటగా మార్చుకునేందుకు యత్నించారు.
ఉద్యమ కాలంలోనూ ‘సైకిల్’కే జై
నియోజకవర్గ ఓటర్లు విలక్షణ తీర్పు ఇవ్వడంలో నిష్ణాతులు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో తెలంగాణా ఉద్యమాన్ని లెక్కచేయకుండా కొడంగల్ ప్రజలు టీడీపీ పట్టం కట్టారు. ఇక్కడ గురునాథ్‌రెడ్డికి ఐదుసార్లు అవకాశం ఇచ్చిన ప్రజలు నందారం వెంకటయ్యను మూడు సార్లు అసెంబ్లీకి పంపించారు. ఈ ప్రాంతంలో ఒకసారి కాంగ్రెస్‌ను గెలిపిస్తే మరోసారి టీడీపీని గెలిపించేవారు. 2018 వరకు కాంగ్రెస్, టీడీపీ మధ్యనున్న పోరు 2018 నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండింది.
అప్పట్లో టీఆర్‌ఎస్ అధినేతల చాకచక్యం.. రాజకీయ చతురతను ప్రదర్శించి అత్యంత క్టిష్ట పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటీ నె లకొంది. కాగా 2018 ఎన్నికల మాదిరిగా బీఆర్ ఎస్ నేతల రాజకీయ ఎత్తుగడలు పారడం లేదు. అధినేతలు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నరేందర్‌రెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. ఆయనకు బీఆర్‌ఎస్ నేతలు, మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారు.
తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోనున్న నియోజకవర్గం. ప్రతీ ఎన్నికలోతమదైన తీర్పునిస్తున్న ఓటర్లు. ఈ ఎన్నికల్లో ఎవరిని ఆశీర్వదిస్తారో అంతుపట్టడం లేదు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నా.. కారు, కాంగ్రెస్ మధ్యే టఫ్ ఫైట్ ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.
కొడంగల్‌కు ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు
సంవత్సరం పేరు పార్టీ
► 1957 అచ్యుతారెడ్డి కాంగ్రెస్
► 1962 రుక్మారెడ్డి స్వతంత్ర
►1967 అచ్యుతారెడ్డి స్వతంత్ర
►1972 నందారం వెంకటయ్య స్వతంత్ర
►1978 గురునాథ్‌రెడ్డి స్వతంత్ర
►1983 గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్
►1985 నందారం వెంకటయ్య టీడీపీ
►1989 గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్
►1994 నందారం వెంకటయ్య టీడీపీ
►1996 ఉప ఎన్నిక/ సూర్యనారాయణ టీడీపీ
►1999 గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్
►2004 గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్
►2009 రేవంత్‌రెడ్డి టీడీపీ
►2014 రేవంత్‌రెడ్డి టీడీపీ
►2018 నరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment