కొడంగల్/ఆమనగల్లు: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సీఎం పీఠం అధిరోహించనుండడంతో స్థానికంగా పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటా యి. రాష్ట్రాన్ని పాలించేది ‘మనవాడే’ అంటూ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకుని జోష్‌లో మునిగిపోయారు. పీసీసీ అధ్యక్షుడిగా ఒంటి చెత్తో పార్టీని విజయతీరాలకు చేర్చిన రేవంత్‌రెడ్డి అధికార పీఠాన్ని ‘చే’జిక్కించుకోగలిగారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా కొడంగల్ పేరు మరోసారి మార్మోగింది. పోలింగ్ ముగిసి.. కౌంటింగ్ జరిగిన రోజు నుంచి ఎక్కడ చూసినా రేవంత్‌పైనే చర్చ. కాస్త ఉత్కంఠ రేకెత్తించినప్పటికీ అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి పదవి వరించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కొడంగల్‌లో భారీ మెజారిటీ
కొడంగల్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి రేవంత్ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నందనంవెంకటయ్యపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన గురునాథ్‌రెడ్డి 20,585 ఓట్లు సాధించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ 32,532 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
అభిమానుల సంబరాలు
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిపేరును అధిష్టానం ప్రకటించగానే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి చేసిన కృషిని అధిష్టానం గుర్తించిందని.. తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడిగా ఎదిగిన ఆయనను వారి ఆకాంక్షల మేరకు సీఎంగా ప్రకటించిందని పలువురు నాయకులు మాట్లాడారు. రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు.
మాడ్గుల అల్లుడే..
సీఎంగా రేవంత్‌రెడ్డిని ప్రకటించడంతో ఆయన అత్తగారి ఊరైన మాడ్గులలో సంబరాలు మిన్నంటాయి. మాడ్గులతో రేవంత్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేవంత్‌రెడ్డి వివాహం దివంగత కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి సోదరుడు పద్మారెడ్డి కూతురితో జరిగింది. మాడ్గులకు చెందిన పద్మారెడ్డికి స్వగ్రామంలో ఇళ్లు ఉంది. తరచూ అత్తగారి ఊరికి రేవంత్‌రెడ్డి వచ్చివెళ్లేవారు. రాజకీయ నేపథ్యం ఉన్న ఇంటికి అల్లుడైన రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన కొన్నేళ్లలోనే సీఎం కావడం విశేషం. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో మాడ్గులవాసులు ‘మా ఊరి అల్లుడు సీఎం’ అవుతున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాడు మామ వద్దనుకున్నాడు.. నేడు అల్లుడు అయ్యాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి పదవిని మాడ్గులకు చెందిన జైపాల్‌రెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదన చేసినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. జైపాల్‌రెడ్డి కుటుంబానికి అవకాశం వచ్చినా కాదనుకున్నప్పటికీ ఇప్పుడు అదే ఇంటికి అల్లుడైన రేవంత్‌రెడ్డి సీఎం అవుతున్నారు.
అభివృద్ధిపై ఎన్నో ఆశలు
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు. స్వగ్రామమైన కొండారెడ్డిపల్లితో పాటు అత్తగారి ఊరైన మాడ్గులను అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment