Chevella Lok Sabha: చేవెళ్ల బరిలో ముగ్గురు ఉద్దండులు | Political heat in Chevella Lok Sabha constituency | Sakshi
Sakshi News home page

Chevella Lok Sabha: చేవెళ్ల బరిలో ముగ్గురు ఉద్దండులు

Published Mon, Feb 19 2024 12:54 PM | Last Updated on Mon, Feb 19 2024 12:54 PM

Political heat in Chevella Lok Sabha constituency - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: లోక్‌సభ స్థానాలకు ఏ క్షణమైనా ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉండటంతో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు అటు రాజకీయ పారీ్టలు కూడా సన్నద్ధమయ్యాయి. జిల్లాలోని కీలకమైన చేవెళ్ల స్థానంపై అధికార కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ దృష్టి సారించాయి. సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డినే మళ్లీ బరిలోకి దించనున్నట్లు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటించింది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. 

ఆయన పేరే దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ నుంచి రోజుకో కొత్త అభ్యర్థి తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డికి ఆయనకు మధ్య కొంత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఆయనకు ఈ స్థానం దక్కకపోవచ్చనే చర్చ నడుస్తోంది. వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి రెండు రోజుల క్రితం కారు దిగి హస్తం పారీ్టలో చేరడంతో ఆమెకే అవకాశం ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. మూడు పారీ్టల నుంచి ముగ్గురు ఉద్దండులు బరిలోకి దిగనుండడంతో ఈసారి చేవెళ్ల పోరు రసవత్తరంగా మారనుంది. 

క్షేత్రస్థాయిలో ఆశావహులు 
చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. షాద్‌నగర్, కొడంగల్‌ నియోజకవర్గాలు మహబూబ్‌నగర్‌ పరిధిలో ఉండగా, కల్వకుర్తి నియోజకవర్గం నాగర్‌కర్నూల్‌ పరిధిలో కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భువనగిరి పరిధిలో, ఎల్బీనగర్‌ నియోజకవర్గం మేడ్చల్‌ మల్కాజిగిరి పరిధిలో కొనసాగుతున్నాయి. 2019లో ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

 12,70,687 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డికి 5,16,363 ఓట్లు (40.64 శాతం) రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 5,0,318 ఓట్లు (39. 61శాతం)వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బి.జనార్దన్‌రెడ్డికి 1,95,919 ఓట్లు (15.42 శాతం) వచ్చాయి. బీఎస్పీ సహా ఇతర పారీ్టలకు డిపాజిట్‌  దక్కలేదు. పోటీలో ఉన్న 20 మందికి నోటా (9,045) కంటే తక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. 2024 ఫిబ్రవరి 8 నాటికి ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 29,14,124 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. వీరిలో 14,93,369 మంది పురుషులు,  14,20,469 మంది మహిళలు ఉన్నారు. మరో 286 మంది థర్డ్‌ జెండర్లు ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటాపోటీగా తలపడనున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించే నేతలంతా ఆర్థికంగా బలవంతులు కావడంతో ఎన్నికల కోసం భారీగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు ఇతర పారీ్టల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వల వేస్తున్నారు. వీరికి భవిష్యత్తులో పలు రాజకీయ పదవులతో పాటు నగదు, ఖరీదైన వాహనాలు ఎరగా చూపుతున్నట్లు తెలిసింది.     
 
తుది ఓటరు జాబితా వెల్లడి 
లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచి్చనా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎన్నికల కమిషన్‌ తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ నెల 8న జాబితా విడుదల చేసింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 3,369 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, వీటి పరిధిలో 35,91,987 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో 18,50,292 మంది పురుషులు, 17,40,379 మంది మహిళలు ఉన్నారు. 449 మంది థర్డ్‌జెండర్లు ఉన్నారు. వీరితో పాటు 286 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు, మరో 581 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. వికారాబాద్‌ జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 9,84,068 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 4,86,109 మంది పురుషులు, 4,97,920 మంది మహిళలు ఉన్నారు. మరో 39 మంది థర్డ్‌ జెండర్లు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement