సమావేశంలో మాట్లాడుతున్న షామ మహమ్మద్
సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏది చెప్పిందో అది కచ్చితంగా చేసి తీరుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ షమా మహమ్మద్ స్పష్టం చేశారు. శనివారం మండలంలోని బూర్గుపల్లి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.
ఇప్పటికే కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. ప్రతి నెలా మహిళలకు రూ.2500, ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు రూ.4వేల పింఛన్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రూ. 40వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 150కోట్లకు పెంచి భారీగా కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.
అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.2లక్షల రుణమాఫీ, రూ.3లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికీ 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం హామీని నిలుపుకోలేపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి రూ. 5లక్షలు ఇస్తుందని తెలిపారు. ఆమె వెంట నాయకుడు లలిత్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment