కసిరెడ్డి నారాయణరెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి - Sakshi
సాక్షి, రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే సుంకిరెడ్డి కాంగ్రెస్ ప్రచార పర్వంలోకి రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదినుంచి హస్తం పార్టీ తరఫున కల్వకుర్తి టికెట్ ఆశించిన ఆయన కసిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో అలక పానుపు ఎక్కారు. దీంతో రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాజకీయ భవిష్యత్తుపై సుంకిరెడ్డికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ నారాయణరెడ్డి బుధవారం ఉదయం రాఘవేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి మాట్లాడినట్లు తెలిసింది.
జోష్ నింపిన సుంకిరెడ్డి
వెల్దండ మండలం చౌదర్‌పల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఏడాదిన్నర కాలంగా ఐక్యత ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనతో దూసుకుపోయారు. ఈక్రమంలో కల్వకుర్తి వ్యాప్తంగా సుమారు రూ.20 కోట్లుకు పైగా పనులు చేశారు. ఐదు నెలల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అప్పటి నుంచి స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేశారు. సుంకిరెడ్డి రాకతో కల్వకుర్తి కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కల్వకుర్తి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. అనూహ్యంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం, అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
అనుచరుల ఒత్తిడి..
కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని రాఘవేందర్‌రెడ్డి అనుచరులు, అభిమానులు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఈ మేరకు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. అంతేకాకుండా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సుంకిరెడ్డి బరిలో ఉంటారని చెప్పుకొన్నారు.
సుంకిరెడ్డికి బుజ్జగింపులు..
సుంకిరెడ్డి బరిలో ఉంటే విజయావకాశాలపై ప్రభావం పడుతుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో చర్చలు జరిపింది. రెండు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాఘవేందర్‌రెడ్డిని కలిసి బుజ్జగించినట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు సముచిత స్థానం కల్పిస్తామని హామీ దక్కడంతో కొంత మెత్తబడ్డట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment