kasireddy
-
నామినేటెడ్‌పై ఆశలు.. జిల్లావ్యాప్తంగా తీవ్రమైన పోటీ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నామినేటెడ్ పదవుల జాతర కొనసాగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ప్రభుత్వం రద్దు చేయడంతో నామినేటెడ్ పదవులను పొందేందుకు ఆశావహ నేతలు విస్త్రృతంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కని నేతలు, ఇతరుల కోసం ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన ముఖ్యనేతలు ఆశావహుల్లో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్పదవులపై ఆశలు.. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. వీరిలో స్టేట్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వేద సాయిచంద్ సతీమణి రజని, ముడా చైర్మన్‌గా గంజి వెంకన్న ముదిరాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్, మిషన్ భగీరథ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రమావత్ వాల్యానాయక్, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్ పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం వీరి పదవులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలంతా ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీకి కసిరెడ్డి రాజీనామా.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేతలు, పార్టీ టికెట్ ఆశించిన ముఖ్యులకు ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవులను ఆఫర్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నామినేటెడ్ పదవులపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇవి చదవండి: ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం! -
TS Election 2023: ఇద్దరి ‘చేతులు’ కలిశాయా..!? రంగంలోకి రేవంత్‌రెడ్డి..
సాక్షి, రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే సుంకిరెడ్డి కాంగ్రెస్ ప్రచార పర్వంలోకి రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదినుంచి హస్తం పార్టీ తరఫున కల్వకుర్తి టికెట్ ఆశించిన ఆయన కసిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో అలక పానుపు ఎక్కారు. దీంతో రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాజకీయ భవిష్యత్తుపై సుంకిరెడ్డికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ నారాయణరెడ్డి బుధవారం ఉదయం రాఘవేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి మాట్లాడినట్లు తెలిసింది. జోష్ నింపిన సుంకిరెడ్డి వెల్దండ మండలం చౌదర్‌పల్లికి చెందిన ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఏడాదిన్నర కాలంగా ఐక్యత ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనతో దూసుకుపోయారు. ఈక్రమంలో కల్వకుర్తి వ్యాప్తంగా సుమారు రూ.20 కోట్లుకు పైగా పనులు చేశారు. ఐదు నెలల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేశారు. సుంకిరెడ్డి రాకతో కల్వకుర్తి కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కల్వకుర్తి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. అనూహ్యంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం, అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అనుచరుల ఒత్తిడి.. కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని రాఘవేందర్‌రెడ్డి అనుచరులు, అభిమానులు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఈ మేరకు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. అంతేకాకుండా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సుంకిరెడ్డి బరిలో ఉంటారని చెప్పుకొన్నారు. సుంకిరెడ్డికి బుజ్జగింపులు.. సుంకిరెడ్డి బరిలో ఉంటే విజయావకాశాలపై ప్రభావం పడుతుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో చర్చలు జరిపింది. రెండు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాఘవేందర్రెడ్డిని కలిసి బుజ్జగించినట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు సముచిత స్థానం కల్పిస్తామని హామీ దక్కడంతో కొంత మెత్తబడ్డట్లు సమాచారం. -
TS: ఎన్ఆర్ఐకి కాంగ్రెస్ హ్యాండిస్తుందా?
రంగారెడ్డి: కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రాజీ నామా చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈసారి కూడా బరిలో పాతకాపులే ఉంటారని భావించినప్పటికీ ఊహించని విధంగా కసిరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కసిరెడ్డి చేరికతో కాంగ్రెస్‌లో మరింత జోష్ రానుందని భావిస్తున్నారు. జైపాల్‌యాదవ్ అభ్యర్థిత్వం నేపథ్యంలో.. కల్వకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ను కసిరెడ్డి 2018లో ఆశించినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం హామీతో పార్టీ విజయా నికి కృషి చేశారు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా తనకే టికెట్ వస్తుందని భావించిన నేపథ్యంలో అధిష్టానం నిర్ణయంతో ఖంగుతిన్నారు. తన అనుచరులు, అభిమానుల ఒత్తిడితో పోటీ చేయాలని నిర్ణయించారు. కసిరెడ్డిపై కాంగ్రెస్ గురి.. తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై కాంగ్రెస్ గురి పెట్టింది. పార్టీలోకి తీసుకురావడానికి పీసీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి చొరవ తీసుకుని కసిరెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. ఆ తరువాత ఏఐసీసీ నాయకులతో మాట్లాడించి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి హామీ ఇప్పించినట్టు ప్రచారం జరిగింది. ఇన్నాళ్లు కల్వకుర్తి నుంచి పోటీ చేస్తాడని భావించిన వంశీచంద్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతోపాటు ఎమ్మెల్యేగా పోటీచేయడం కన్నా ఎంపీగా బరిలో నిలవడానికి ఆసక్తి చూపించనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి నుంచి బలమైన అభ్యర్థికి అవకాశం ఇవ్వడానికి గాను ఎమెల్సీ కసిరెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. సుంకిరెడ్డి దారెటు..? కల్వకుర్తి కాంగ్రెస్‌పార్టీ టికెట్‌ను ఆశిస్తూ నియోజక వర్గంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి దారెటు అన్న చర్చ జరుగుతోంది. ఏడాదికాలంగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్‌పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్వేలతో టికెట్ కేటాయిస్తే తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి టికెట్ హామీతో కాంగ్రెస్‌లో చేరుతుండటంతో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండుమూడు రోజులుగా అభిమానులు, అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహించగా బరిలో ఉండాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయం కోసం పనిచేయాలని.. అధికారంలోకి వచ్చిన తరువాత సుంకిరెడ్డికి మంచి అవకాశాలు కల్పిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభయమిచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తారా..? ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తారా.. అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. ఆదివారం ఉదయం.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన కసిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని భావిస్తున్నానని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భారత రాష్ట్ర సమితికి షాక్ తగలనుంది. ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి త్వరలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. తాజాగా ఇటీవల రాజకీయపరంగా చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆయనకు ఈ సారి సైతం భంగపాటే ఎదురైన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కసిరెడ్డికి తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. తనతో పాటు తన వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడం.. ఈసారి సైతం జైపాల్‌కే అధిష్టానం మద్దతు పలుకుతుండడంతో ఇన్నాళ్లుగా వేచి చూసే ధోరణిని అవలంబించిన కసిరెడ్డి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 29న లేదంటే 30న ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం ‘గులాబీ’కి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాలుగైదు దఫాలుగా పెద్దల రాజీ యత్నాలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజకీయ పరిణామాల క్రమంలో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి స్వరాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను మార్చాలంటూ అసమ్మతి నేతలు మండలాల వారీగా సమావేశా లు నిర్వహిస్తూ నిరసన గళం వినిపించారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎకై ్సజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు కసిరెడ్డితో పాటు అసమ్మతి నేతలతో గత నెల చివర నుంచి ఇప్పటివరకు నాలుగైదు పర్యాయాలు సంప్రదింపులు జరిపి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కసిరెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ సైతం తీసుకున్నా.. అనివార్య కారణాలతో రద్దయినట్లు తెలిసింది. ఆ తర్వాత కేటీఆర్ సోమవారం రాత్రి కసిరెడ్డిని స్వయంగా పిలిపించుకుని.. ‘తొందరపాటు నిర్ణ యం తీసుకోవద్దు.. టికెట్ కేటాయింపుపై సీఎంతో మాట్లాడుతాను.. మూడు రోజులు ఓపిక పట్టండి’ అని నచ్చజెప్పేందుకు యత్నించినట్లు సమాచారం. అయితే కసిరెడ్డి వర్గానికి చెందిన అనుచరులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం భేటీ అయి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు వినికిడి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. తనతో పాటు తనను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాజకీయ నేపథ్యం.. కిసరెడ్డి 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఆశించారు. టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2016లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో చేరారు. ఇదే సంవత్సరంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించినా.. దక్కలేదు. అనంతరం 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండోసారి ఆయన ఎన్నికయ్యారు. ‘కల్వకుర్తి’లోమారనున్న సమీకరణలు.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కసిరెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండడంతో కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేరు ఇన్నాళ్లుగా వినిపిస్తూ వచ్చింది. అయితే ఆయన సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండడంతో ఆయన సేవలను ఢిల్లీస్థాయిలో వినియోగించుకోవాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను జల్లెడ పడుతున్న అధిష్టానం కల్వకుర్తిపై ఎప్పటి నుంచో నజర్ వేసింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి రంగంలోకి దిగడంతో పాటు కసిరెడ్డికి టికెట్‌పై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం గూటికి చేరేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ పరిణామాలు కల్వకుర్తితో పాటు పలు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు చేటు తెస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఎలా జరిగిందో..!
రాజంపేట, న్యూస్‌లైన్ : రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్‌మోహనరెడ్డి ఇంట్లో శనివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఇద్దరు దుర్మరణం చెందారు. పేలుడు కారణాలపై పోలీసులు భిన్నకోణాల్లో ఆరా తీస్తున్నారు. సంఘటనస్థలాన్ని ఓఎస్డీ చంద్రశేఖరరెడ్డి, స్థానిక డీఎస్పీ జీవీరమణతో కలిసి పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్, బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. పేలుడుకు కారణాలను తెలుసుకునేందుకు సంఘటన స్ధలంలో లభ్యమైన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. కాగా ఆదివారం పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జరిగిన పేలుడు రాజంపేట ప్రాంతంలో రాజకీయవర్గాల్లో కలకలంరేపింది. పేలుడు ప్రాంతంలో పెద్దఎత్తున జనం గుమికూడటంతో ఆర్‌ఎస్‌రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మృతులు గుంటూరు జిల్లావాసులు మదన్‌మోహన్‌రెడ్డి స్వగృహం రాజంపేట పట్టణం ఆర్‌ఎస్‌రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా ఉంది. కుక్కుల పోతిరెడ్డి, లక్షుమమ్మ అనే దంపతులు 15 ఏళ్లుగా మదన్ ఇంటిలో కాపలాదారులుగా నివసిస్తున్నారు. వీరు గుంటూరు జిల్లా బాపట్లలోని మాలేపాటిపాలెంకు చెందినవారు. వీరికి ఇద్దరు కొడుకులు , ఒక కూతురు ఉన్నారు. వీరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరందరూ జీవనోపాధికోసం రాజంపేటకు వచ్చారు. ఏంజరిగింది... మదన్ ఇంటి వెనుకవైపు గదిలో పోతిరెడ్డి, లక్షుమమ్మ ఉంటున్నారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో వీరు నిద్రకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున నాలుగుగంటల ప్రాంతంలో ఒక్కసారిగా వీరు నిద్రిస్తున గదిలో పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కలవారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనస్ధలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే గదిలో ఉన్న భార్యాభర్తలు విగతజీవులయ్యారు. అన్నీ అనుమానాలే? మదన్ ఇంట్లో జరిగిన పేలుడుపై అన్ని అనుమానాలే పుట్టుకొస్తున్నాయి. ఇదే అంశం అటు జనంలోనూ.. ఇటు పోలీసుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రాధమిక విచారణలో గ్యాస్లీక్గా పోలీసులు భావించారు. గదిలో రెండు గ్యాస్‌సిలెండర్లు ఉన్నాయి. ఒకటి హెచ్‌పీ, మరొకటి ఇండేన్‌కు చెందిన సిలిండర్, వీటి నుంచి గ్యాస్ లీక్ అయినట్లు పోలీసులు భావించారు. అయితే పెద్దశబ్ధం రావడం, సిలిండర్లు యధాస్థానంలో ఉండటం చూస్తుంటే పేలుడుకు మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఓఎస్డీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ద్వారా పేలుడు కారణాలు వెల్లడవుతాయన్నారు. పోలీసులే తేల్చాలి తన ఇంటిలో జరిగింది పేలుడా, గ్యాస్ సిలిండర్ పేలుడా అనేది పోలీసులే తేల్చాలని మాజీ ఎమ్మెల్యే మదనమోహనరెడ్డి పేర్కొన్నారు. జరిగిన సంఘటన బాధాకరమన్నారు. రాజంపేటలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. పోలీసులు విచారించి దోషులను శిక్షించాలన్నారు.