రంగారెడ్డి: కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు రాజీ నామా చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈసారి కూడా బరిలో పాతకాపులే ఉంటారని భావించినప్పటికీ ఊహించని విధంగా కసిరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కసిరెడ్డి చేరికతో కాంగ్రెస్‌లో మరింత జోష్ రానుందని భావిస్తున్నారు.
జైపాల్‌యాదవ్ అభ్యర్థిత్వం నేపథ్యంలో..
కల్వకుర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ను కసిరెడ్డి 2018లో ఆశించినప్పటికీ బీఆర్‌ఎస్ అధిష్టానం హామీతో పార్టీ విజయా నికి కృషి చేశారు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా తనకే టికెట్ వస్తుందని భావించిన నేపథ్యంలో అధిష్టానం నిర్ణయంతో ఖంగుతిన్నారు. తన అనుచరులు, అభిమానుల ఒత్తిడితో పోటీ చేయాలని నిర్ణయించారు.
కసిరెడ్డిపై కాంగ్రెస్ గురి..
తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై కాంగ్రెస్ గురి పెట్టింది. పార్టీలోకి తీసుకురావడానికి పీసీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి చొరవ తీసుకుని కసిరెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. ఆ తరువాత ఏఐసీసీ నాయకులతో మాట్లాడించి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి హామీ ఇప్పించినట్టు ప్రచారం జరిగింది.
ఇన్నాళ్లు కల్వకుర్తి నుంచి పోటీ చేస్తాడని భావించిన వంశీచంద్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతోపాటు ఎమ్మెల్యేగా పోటీచేయడం కన్నా ఎంపీగా బరిలో నిలవడానికి ఆసక్తి చూపించనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి నుంచి బలమైన అభ్యర్థికి అవకాశం ఇవ్వడానికి గాను ఎమెల్సీ కసిరెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది.
సుంకిరెడ్డి దారెటు..?
కల్వకుర్తి కాంగ్రెస్‌పార్టీ టికెట్‌ను ఆశిస్తూ నియోజక వర్గంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి దారెటు అన్న చర్చ జరుగుతోంది. ఏడాదికాలంగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్‌పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్వేలతో టికెట్ కేటాయిస్తే తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి టికెట్ హామీతో కాంగ్రెస్‌లో చేరుతుండటంతో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
రెండుమూడు రోజులుగా అభిమానులు, అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహించగా బరిలో ఉండాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయం కోసం పనిచేయాలని.. అధికారంలోకి వచ్చిన తరువాత సుంకిరెడ్డికి మంచి అవకాశాలు కల్పిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభయమిచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తారా..? ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తారా.. అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment