రాజంపేట, న్యూస్‌లైన్ : రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్‌మోహనరెడ్డి ఇంట్లో శనివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఇద్దరు దుర్మరణం చెందారు. పేలుడు కారణాలపై పోలీసులు భిన్నకోణాల్లో ఆరా తీస్తున్నారు. సంఘటనస్థలాన్ని ఓఎస్‌డీ చంద్రశేఖరరెడ్డి, స్థానిక డీఎస్పీ జీవీరమణతో కలిసి పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్, బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. పేలుడుకు కారణాలను తెలుసుకునేందుకు సంఘటన స్ధలంలో లభ్యమైన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. కాగా ఆదివారం పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జరిగిన పేలుడు రాజంపేట ప్రాంతంలో రాజకీయవర్గాల్లో కలకలంరేపింది. పేలుడు ప్రాంతంలో పెద్దఎత్తున జనం గుమికూడటంతో ఆర్‌ఎస్‌రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
మృతులు గుంటూరు జిల్లావాసులు
మదన్‌మోహన్‌రెడ్డి స్వగృహం రాజంపేట పట్టణం ఆర్‌ఎస్‌రోడ్డులోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉంది. కుక్కుల పోతిరెడ్డి, లక్షుమమ్మ అనే దంపతులు 15 ఏళ్లుగా మదన్ ఇంటిలో కాపలాదారులుగా నివసిస్తున్నారు. వీరు గుంటూరు జిల్లా బాపట్లలోని మాలేపాటిపాలెంకు చెందినవారు. వీరికి ఇద్దరు కొడుకులు , ఒక కూతురు ఉన్నారు. వీరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరందరూ జీవనోపాధికోసం రాజంపేటకు వచ్చారు.
ఏంజరిగింది...
మదన్ ఇంటి వెనుకవైపు గదిలో పోతిరెడ్డి, లక్షుమమ్మ ఉంటున్నారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో వీరు నిద్రకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున నాలుగుగంటల ప్రాంతంలో ఒక్కసారిగా వీరు నిద్రిస్తున గదిలో పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కలవారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనస్ధలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే గదిలో ఉన్న భార్యాభర్తలు విగతజీవులయ్యారు.
అన్నీ అనుమానాలే?
మదన్ ఇంట్లో జరిగిన పేలుడుపై అన్ని అనుమానాలే పుట్టుకొస్తున్నాయి. ఇదే అంశం అటు జనంలోనూ.. ఇటు పోలీసుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రాధమిక విచారణలో గ్యాస్‌లీక్‌గా పోలీసులు భావించారు. గదిలో రెండు గ్యాస్‌సిలెండర్లు ఉన్నాయి. ఒకటి హెచ్‌పీ, మరొకటి ఇండేన్‌కు చెందిన సిలిండర్, వీటి నుంచి గ్యాస్ లీక్ అయినట్లు పోలీసులు భావించారు. అయితే పెద్దశబ్ధం రావడం, సిలిండర్లు యధాస్థానంలో ఉండటం చూస్తుంటే పేలుడుకు మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఓఎస్‌డీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ద్వారా పేలుడు కారణాలు వెల్లడవుతాయన్నారు.
పోలీసులే తేల్చాలి
తన ఇంటిలో జరిగింది పేలుడా, గ్యాస్ సిలిండర్ పేలుడా అనేది పోలీసులే తేల్చాలని మాజీ ఎమ్మెల్యే మదనమోహనరెడ్డి పేర్కొన్నారు. జరిగిన సంఘటన బాధాకరమన్నారు. రాజంపేటలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. పోలీసులు విచారించి దోషులను శిక్షించాలన్నారు.
ఎలా జరిగిందో..!
Published Sun, Apr 6 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
Advertisement