సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ ఇప్పటికీ తొలగిపోలేదు. స్క్రీనింగ్ కమిటీలోని సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి.. ఒక్కో వర్గం.. ఒక్కో అభ్యర్థి పేరును సూచిస్తుండటంతో మురళీధరన్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. క్షేత్రస్థాయి సర్వే ఫలితాలకు.. సభ్యులు ప్రతిపాదిస్తున్న పేర్లకు పొంతన లేకుండా పోవడం కూడా మరో కారణంగా తెలిసింది.
మహేశ్వరం, తాండూరు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఇక్కడి అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లో తొలి దశలో ఎన్నికలు ఉండటంతో అధిష్టానం ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. 14 తర్వాత తెలంగాణ అభ్యర్థుల జాబితాపై ఓ స్పష్టత రానున్నట్టు సమాచారం.
ఏఐసీసీ కోర్టులో మహేశ్వరం సీటు..
మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మంచి పట్టుంది. సెగ్మెంట్ నుంచి 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత, సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి సహా మొత్తం 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మేయర్ చిగురింత పారిజాత పేరు దాదాపు ఖరారైందనుకున్న సమయంలో ఆశావహుల నుంచి అసంతృప్తి మొదలైంది.
ఏళ్ల తరబడి పార్టీ జెండానే నమ్ముకుని పని చేస్తున్న సీనియర్ నేతలను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇటీవలే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోచేరిన కొత్త మనోహర్‌రెడ్డి సైతం ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన జాబితాలో తన పేరు లేదని తెలిసి, ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌పైనే టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు గుప్పించారు.
ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా సహా ఇతర సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దల ముందు తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీనియర్లలో ఎవరికి ఇచ్చినా పరవాలేదు కాని.. ఇతరులెవరికీ టికెట్ ఇచ్చినా పని చేయబోమని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో అధిష్టానం ఈ సీటు కేటాయింపుపై సందిగ్ధంలో పడింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మేయర్ కోసం పట్టుబడుతుండగా, భట్టి, యాష్కీ సహా ఇతర సభ్యులు చల్లా లేదా దేప పేర్లను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది.
స్క్రీనింగ్ కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి.. వేర్వేరు పేర్లను సూచిస్తుండ టంతో మురళీధరన్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ కూడా చేతులెత్తేసింది. అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీకి అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. క్షేత్రస్థాయిలోని నేతలు మాత్రం ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటుండటం గమనార్హం.
అధిష్టానానిదే ఫైనల్..
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీకి గట్టిపట్టుంది. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కొంతకాలంగా ఇక్కడే మకాం వేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌తో ఆయనకు అభిప్రాయ బేధాలు లేకపోలేదు. దీంతో ఆయన ఏకంగా ఏఐసీసీ పెద్దల ఆశీస్సులతో రంగంలోకిదిగారు.
తీరా అభ్యర్థుల జాబితాను ప్రకటించే ముందు బీఆర్‌ఎస్ నేత.. డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. తాండూరు టికెట్ మనోహర్‌రెడ్డికి కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ మనోహరెడ్డి పేరును సూచిస్తుంటే.. భట్టి సహా ఇతర నేతలు కేఎల్‌ఆర్ పేరును సూచిస్తున్నట్లు తెలిసింది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరు పేర్లను సిఫార్సు చేయడం, ఈ మేరకు ఒత్తిడి తీసుకొస్తుండటంతో మురళీధరన్ కమిటీ ఎటూ తేల్చుకోలేక.. అభ్యర్థి పేరు పరిశీలన అంశాన్ని పక్కన పెట్టింది.
టికెట్ కేటాయింపు అంశాన్ని పూర్తిగా అధిష్టానానికే వదిలేసింది. అప్పటి వరకు ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత సైతం స్థానికేతరులకు టికెట్ కేటాయించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం గమనార్హం. 14 తర్వాత విడుదల చేసే మొదటి విడత జాబితాలో ఇక్కడి అభ్యర్థి పేరు ఉండకపోవచ్చని.. తుది జాబితాలోనే పేరు ఖరారు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment