ఇబ్రహీంపట్నం టౌన్ ముఖచిత్రం
సాక్షి, రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం: 'విప్లవాల పురిటిగడ్డ.. కమ్యూనిస్టుల కంచుకోట.. రాచకొండ గుట్టలు నిలయంగా సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం.. నియోజకవర్గ సొంతం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందుగానే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఉండేది. అంతటి చరిత్ర కలిగిన ఈ గడ్డపై ప్రధాన పార్టీలన్నీ తమ జెండాలుఎగురవేశాయి.'
నగరానికి ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలు కాలానుగునంగా తమ ప్రాబల్యాన్ని చాటాయి. ఈ సెగ్మెంట్ హస్తం చేజారి రనాలుగు దశబ్దాలు కావొస్తుండగా.. టీడీపీ, సీపీఎంలు మూడు దశాబ్ధాలుగా విజయం సాధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ‘కారు’ 2018లో బోణీ కొట్టింది. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ఉండేది.
ఇప్పటి వరకు 16సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, మూడుసార్లు సీపీఎం, ఒకసారి టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1978 నుంచి 2004 వరకు ఈ స్థానం ఎస్సీ రిజర్‌వ్డ్. ఇక్కడ ప్రాతినిథ్యం వహించిన 11మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే అమాత్య పదవి వరించింది. 15ఏళ్ల పాటు సీపీఎం ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గాన్ని శాసించారు. రోజురోజుకు కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతుంది. కాంగ్రెస్, టీడీపీల పొత్తుల ప్రభావం కారణంగా కమ్యూనిస్టుల ప్రాబ ల్యం మసకబారింది.
1952లో ద్విసభ్య శాసనసభ్యులు..
1952లో జరిగిన ఈ ఎన్నికల్లో ద్విసభ్య శాసనసభ నియోజకవర్గంగా ఉండేది. తూర్పు, పడమటి ప్రాంతాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించేవారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో 1952 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ నుంచి పిల్లయిపల్లి పాపిరెడ్డి (తూర్పు భాగం), కాంగ్రెస్ నుంచి ఎంబీ గౌతమ్ పడమటి బాగం(ఇబ్రహీంపట్నం ప్రాంతం) నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు.1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన అనంతరం ఏకసభ్య నియోజకవర్గంగా మారింది.
ఇద్దరు అభ్యర్థులను వరించిన హ్యాట్రిక్!
1952 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంబీ గౌతమ్, పీడీఎఫ్ నుంచి పిలాయిపల్లి పాపిరెడ్డి, 1957, 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన లక్ష్మీనర్సయ్య హ్యాట్రిక్ విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో హస్తంపై అనంతరెడ్డి గెలుపొందింది. 1978 నుంచి ఎస్సీ రిజర్‌డ్వ్ స్థానంగా మారింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుమిత్రదేవి అసెంబ్లీ మెట్లెక్కారు. ఆమె మృతి చెందడంతో 1981లో నిర్వహించిన ఉప ఎన్నిక, 1983 సాధారణ ఎన్నికల్లో ఏజీ కృష్ణ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం వీస్తున్న తరుణంలో 1982లో కాంగ్రెస్ జెండా ఎగరడ గమనార్హం. అనంతరం నియోజవర్గ రాజకీయాల్లో మార్పు వచ్చింది. 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికలోనూ కాంగ్రెస్ ఈ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. 1985 ఎన్నికల్లో కె.సత్యనారాయణ టీడీపీ నుంచి గెలుపొందారు.
1989, 1994 ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న సీపీఎం నుంచి కొండిగారి రాములు, 1999లో సైకిల్‌పై కొండ్రు పుష్పలీల, 2004లో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సీపీఎం నుంచి మస్కు నర్సింహ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన సైకిల్ దిగి కారెక్కారు. 2018లో టీఆర్‌ఎస్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. డీలిమిటేషన్‌లో మహేశ్వరం, కందుకూరు మండలాల స్థానంలో హయత్‌నగర్ (అబ్దుల్లాపూర్‌మెట్) మండలం ఇందులో కలిసింది. దీంతో 2009 నుంచి మళ్లీ జనరల్ స్థానంగా మారింది. నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు సుమిత్రాదేవి, పుష్పలీల ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించారు.
ఇద్దరు మంత్రులు..
నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మంత్రులు పదువులు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన లక్ష్మీనర్సయ్య, టీడీపీ నుంచి ఒకసారి గెలిచిన కొండ్రు పుష్పలీల మంత్రులుగా పనిచేశారు.
హస్తంలో గ్రూపు రాజకీయాలు..
1985 నుంచి కాంగ్రెస్ అపజాయానికి కారణం గ్రూపు రాజకీయాలే. సెగ్మెంట్‌లో బలమైన పార్టీ కేడర్ ఉన్నా నాయకుల మధ్య సఖ్యత లేక పార్టీ గెలుపునకు అడ్డుకట్ట వేస్తున్నాయి.
‘కమలం’ తహ తహ!
నియోజవకర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ ఏళ్ల నుంచి తహ తహలాడుతోంది. ప్రజల్లో పట్టున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పార్టీకి కేడర్ లేకపోవడం గమనార్హం.
ద్విముఖ పోరు..
‘పట్నం’లో మరోమారు కారు జోరు చూపించాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కక మల్‌రెడ్డి రఏనుగు గుర్తుపై పోటీ కేవలం 356 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. దీంతో ఈ ఎన్నికలు మంచిరెడ్డి, మల్‌రెడ్డి మధ్య హోరాహోరి పోరు జరుగనున్నదని విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment