ఢిల్లీలో భట్టివిక్రమార్కను కలిసిన ఎల్‌బీనగర్ కాంగ్రెస్ నాయకులు
సాక్షి, రంగారెడ్డి: ఎల్‌బీనగర్ కాంగ్రెస్ టికెట్ పంచాయితీ హస్తినకు చేరింది. దరఖాస్తుల దాఖలు.. గాంధీభవన్‌లో పోస్టర్ల చించివేతతో ముదిరిన లడాయి తాజాగా టికెట్ విషయంలో స్థానిక, స్థానికేతర వివాదానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లిన ఆశావహులు.. అధిష్టానం ముందు పంచాయితీ పెట్టారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థి ఆ తర్వాత గులాబీ గూటికి చేరడంతో ఎల్‌బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాస్కీ ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. ఇప్పటికే మల్‌రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి గ్రూపు లుగా విడిపోయి టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా యాస్కీ కూడా రేసులోకి రావడంతో వివాదం తారాస్థాయికి చేరింది.
పార్టీ హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్న యాస్కీకి అభ్యర్థిత్వం ఖరారవుతుందనే ప్రచారంతో అప్రమత్తమైన ఆశావహులు తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా నేతలు గురువారం ఢిల్లీకి చేరుకుని పీసీసీ నేతలతో పాటు ఏఐసీసీ పెద్దలను కలిశారు. మరోవైపు ఇటీవల గాంధీభవన్‌లో యాస్కీని వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెలియడం.. ఇది జక్కిడి అనుచరులు చేసిన పనేనని చర్యలు తీసుకోవాలని యాస్కీ చేసిన ఫిర్యాదు కూడా వివాదం ముదిరేలా చేసింది.
స్థానిక పంచాయితీ!
మొదట్నుంచీ ఈ నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడుపుతున్న మల్‌రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఈసారి తమకే సీటు ఖాయమనే ధీమాలో ఉన్నారు. మరోవైపు లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి కూడా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ హవాకు ఎదురొడ్డి గెలిచినందున.. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని పట్టుబడుతున్నారు.
వీరితోపాటు మరికొందరు కూడా తెరవెనుక ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనూహ్యంగా మాజీ ఎంపీ మధుయాస్కీ పేరు తెర మీదకు రావడం.. వీరిని డైలామాలో పడేసింది. ఆయన స్వస్థలం హయత్‌నగర్ కావడంతో తనకు స్థానిక కోటాలో టికెట్ ఖరారు చేయాలని ఆయన అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు. గతంలో నిజామాబాద్ నుంచి పోటీ చేసినందున.. ఆయనను స్థానికేతరుడిగానే పరిగణించాలని సొంత పార్టీలోని వైరివర్గం స్పష్టం చేస్తోంది.
మరోవైపు ఇదే సూత్రం మల్‌రెడ్డి రాంరెడ్డికి కూడా వర్తిస్తుందని చెబుతున్నారు. ఆయన ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌కు చెందినవారు కావడంతో స్థానికేతరుడని.. స్థానికులమైనందున తమ పేర్లను పరిశీలించాలని జక్కిడి, దర్పల్లి వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిక్కుముడిగా మారిన ఎల్‌బీనగర్ టికెట్ పేచీ అధిష్టానం పెద్దల ముందుకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment