సినిమాలో...
‘‘తిన్నవా?’’
‘‘ఆ... తిన్న...నువ్వు?’’
‘‘నేనూ తిన్న... మీ ఇంట్ల ఏం కూర?’’
‘‘తమాట పప్పు..ఇప్పుడు మీ గడియారంల టైమెంతయ్యింది?’’
‘‘మా తాన పదకొండున్నరయ్యింది’’
‘‘అరె... మాతన ఇంకా పదకొండు ఇరవైయయ్యిదే !!’’
సినిమాలోని ‘జాతిరత్నాలు’ ఇలా మాట్లాడుకుంటుంటారు కదా. బయట కూడా ఈ ఎలక్షన్ సీజనంతా ఓటర్లంతా ఇంచుమించూ ఇదే తరహాలో మాట్లాడుకుంటూ ఉంటారు.
‘‘అవ్... మీకాడ ఎవరొస్తున్రు?’’
‘‘మాకాడ బీఆర్‌ఎస్ జోరుగున్నది. మల్ల మీ కాడ?’’
‘‘మాకాడ కాంగ్రెస్ ఊపుమీదున్నది గని... బీఆర్‌ఎస్‌ను కొట్టలేస్తరా ఎవరన్న?’’
‘‘హంగొస్తదా?’’
‘‘హంగొచ్చిందంటే బీఆర్‌ఎస్ గెలిసినట్టేనాయ్’’
సినిమాల మాటలతోని కామెడీ అనిపిస్తదేమోగానీ..ఈ ఎలక్షన్ సీజన్‌ల అది కామెడీ కాదు..ఎవరేందో తెలుస్తది. ఎవరి అవాకులూ, చెవాకులూ, బలాలూ, బలహీనతలూ, కవర్ చేయనీకి మేకపోతులూ...గాంభీర్యాలూ ఇయన్నీ ఉంటయ్.
మొదట ఇట్లాంటి లైట్ లైట్ సంభాషణతోనే మొదలైతది. తర్వాత్తర్వాత కొంచెం కొంచెం లోపలికి వెళ్తరు. చిన్నగ క్లారిటీ వస్తది. తర్వాత అభిప్రాయ పరికల్పన జరుగుతది. ఆ ఎమ్మట్నే ఎవరికి ఓటేస్తె మంచిదో ఒక నిర్ణయం జరుగుతది. ఇదో అంచెలంచెల ప్రక్రియ.
ఈ యాంగిల్ల చూస్తె..జనాలందరూ జాతిరత్నాలే. సేమ్‌టుసేమ్..ఇట్లనే మాట్లాడుకుంటరు. మనం సినిమాలల్ల మాటలు చూసి ఓన్లీ కామెడీ అనుకుంటం. బయట కూడా ఉబుసుపోని కబుర్లు అనుకుంటం. కానీ ఇక్కడిది సీరి‘యస్’. ఎందుకంటే యోగిపేట శ్రీనాథ్ అనేటోడు ఒకడు... ‘జాబు సంపాయిస్త, కంపెనీ ట్యాగు మెళ్ల ఏసుకుంట’..అనుకుంట యోగిపేట నుంచి వస్తడు. ఇంకోడు రైసు పెట్టి..కడుపుల ఆకలి గుర్‌గుర్‌లు కుక్కర్ సీటీల లెక్క కొడుతుంటే..బీఆర్‌ఎస్ వాళ్లు ఇచ్చే నాలుగొందల సిలిండరు కోసమో, కాంగ్రెస్ ఇచ్చే ఐదొందల గ్యాసు కోసమో వెయిట్ చేస్తూ..వెయిట్ తగ్గుతుంటడు.
కానీ నాయకుల మాటల్తోని తెలిసేదేందంటే..వాళ్ల ఇంటర్వ్యూలతోనీ, వాళ్ల స్పీచ్‌లతోనీ, రోడ్‌షోల వాళ్ల ప్రసంగాలతోనీ తెలిసేదేంటంటె..వాళ్లెప్పుడూ కరెక్టే అన్నట్టు మాట్లాడతరు. ఎవరైనా ఏదైన అడిగితే అడిగినోడిదే తప్పన్నట్టు అదరగొడతరు. వాళ్లు చేసేదే రైటు. కావాలంటే..ఆ తప్పును ఎదుటి పారీ్టవాళ్ల మీదికి నెడతారే తప్ప..వాళ్లదే తప్పూ ఉండదు..అది బీఆర్‌ఎస్ అయినా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ, మరింకేపార్టీ అయినప్పటికీ ఇదే ధోరణి.
అందుకే చివరకు ఓటరే అంటడు...
‘‘తప్పు నా నుంచే అయ్యిందంటే ఎల్లిపోతరా..ఈడికెల్నుంచీ..’’ అంటడు.
ఊకె పోకుండ..పోతపోత వాడు ఓటేసి పోతడు. గెలిసినోడికి తప్ప మిగతా అందరికీ ఓటరుగాడు పెంటపెంట చేసి పొయ్యిండనిపిస్తంది. ఎట్టకేలకు జాతిరత్నాల్లాంటి మనమందరమూ క్లైమాక్స్‌ల చెప్పుకోవాల్సిన రత్నం లాంటి సూక్తీ, తెలిసే సత్యం ఏమిటంటే...
ఓటో ఓటరు రక్షితహ!
దీని అర్థం... ఓటరేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తది. ఆ ప్రజాస్వామ్యమే మల్ల ఓటర్ని కాపాడతది. బస్ అంతే.
Comments
Please login to add a commentAdd a comment