ఖమ్మం నియోజకవర్గం
ఖమ్మంలో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పువ్వాడ అజయ్ కుమార్ టిడిపి అభ్యర్ది, మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరావుపై 10991 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. అజయ్ కుమార్ గతసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి ఆ తర్వాత కాలంలో టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018లో టిఆర్‌ఎస్ టిక్కెట్ పై మరోసారి గెలిచారు. అజయ్‌కుమార్‌కు 102760 ఓట్లు రాగా, నామా నాగేశ్వర రావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన మిగిలిన అభ్యర్దులకన్నా నోటాకు 3500 ఓట్లు రావడం విశేషం.
అజయ్ కుమార్ 2018లో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. కాగా నామా నాగేశ్వరరావు టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరి 2019లో ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీచేసి గెలిచారు. తదుపరి లోక్ సభలో టిఆర్‌ఎస్ పక్ష నేత అయ్యారు. ఖమ్మం నియోజకవర్గంలో 2014లో సీనియర్ టిడిపి నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరాజయం చెందారు. కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన పువ్వాడ అజయ్ చేతిలో 5609 ఓట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. పువ్వాడ అజయ్ ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరావు కుమారుడు. ఆయన కొంతకాలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నారు.
తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత అజయ్ కాంగ్రెస్ ఐలో చేరి ఖమ్మం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి 2018లో కూడా గెలిచారు. తుమ్మల గతంలో సత్తుపల్లి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. సత్తుపల్లి రిజర్వుడ్ కావడంతో ఖమ్మంకు మారి రెండువేల తొమ్మిదిలో విజయం సాధించారు. కాని 2014లో ఓడిపోయారు. తదుపరి తుమ్మల టిఆర్‌ఎస్‌లోకి మారి ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టారు. తదుపరి పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. 2018లో పాలేరులో ఓటమి చెందారు. తుమ్మల గతంలో ఎన్.టి.ఆర్., చంద్రబాబుల క్యాబినెట్‌లలో, కెసిఆర్ క్యాబినెట్‌లోను మంత్రిగా ఉన్నారు.
కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా ఉన్న ఖమ్మంలో10సార్లు వామపక్షాలు గెలుపొందాయి. 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. పిడిఎఫ్, సిపిఐ కలిసి ఐదుసార్లు, సిపిఎం నాలుగుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ నాలుగుసార్లు టిడిపి ఒకసారి, టిఆర్‌ఎస్ ఒకసారి గెలుపొందాయి. 2009లో ఖమ్మం నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ ఐ టిక్కెట్ కోసం ప్రయత్నించిన సత్తుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటుచేసి ఇండిపెండెంటుగా పోటీచేశారు. 2014లో టిఆర్‌ఎస్ టిక్కెట్‌పై కొత్తగూడెంలో పోటీచేసి గెలుపొందారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం ఒకసారి శాసనసభకు, మరోసారి లోక్ సభకు గెలుపొందారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పనిచేసిన ప్రముఖ నేత నల్లమల గిరిప్రసాద్ ఖమ్మంలో ఒకసారి గెలుపొందారు. ఆయన ఒకసారి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు రెండుసార్లు గెలిచారు. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 1967,72లలో ఖమ్మంలో గెలిచిన మహ్మద్ రజబ్ అలీ, ఆ తర్వాత సుజాతనగర్‌లో నాలుగుసార్లు గెలిచి జిల్లాలో ఆరుసార్లు గెలుపొందిన నేతగా నమోదయ్యారు.
1957లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తేళ్ళ లక్ష్మీకాంతమ్మ 1978లో హైదరాబాద్ నగరంలో మరోసారి గెలిచారు. ఆమె ఖమ్మం నుంచి మూడుసార్లు లోక్‌సభకు కూడా నెగ్గారు. టిడిపి 1983 నుంచి ఆయా సందర్భాలలో మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చినప్పటికీ స్వయంగా మొదటిసారిగా 2009లో ఖమ్మంలో గెలిచింది. ఆ తర్వాత రెండు ఎన్నికలలో ఓటమి చెందింది. మంచికంటి రామకిషన్‌రావు సిపిఎం పక్షాన రెండుసార్లు గెలిచారు. ఖమ్మంలో తొమ్మిది సార్లు కమ్మ, ఒకసారి రెడ్డి, రెండుసార్లు బ్రాహ్మణ, మూడుసార్లు ముస్లింలు గెలుపొందారు.
ఖమ్మం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment