Ajay Kumar puvvada
-
ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...మరి నెక్స్ట్ రానున్నది ఎవరు..?
ఖమ్మం నియోజకవర్గం ఖమ్మంలో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పువ్వాడ అజయ్ కుమార్ టిడిపి అభ్యర్ది, మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరావుపై 10991 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. అజయ్ కుమార్ గతసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ టిక్కెట్ పై మరోసారి గెలిచారు. అజయ్‌కుమార్‌కు 102760 ఓట్లు రాగా, నామా నాగేశ్వర రావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన మిగిలిన అభ్యర్దులకన్నా నోటాకు 3500 ఓట్లు రావడం విశేషం. అజయ్ కుమార్ 2018లో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. కాగా నామా నాగేశ్వరరావు టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి 2019లో ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీచేసి గెలిచారు. తదుపరి లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నేత అయ్యారు. ఖమ్మం నియోజకవర్గంలో 2014లో సీనియర్ టిడిపి నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరాజయం చెందారు. కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన పువ్వాడ అజయ్ చేతిలో 5609 ఓట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. పువ్వాడ అజయ్ ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరావు కుమారుడు. ఆయన కొంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత అజయ్ కాంగ్రెస్ ఐలో చేరి ఖమ్మం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి 2018లో కూడా గెలిచారు. తుమ్మల గతంలో సత్తుపల్లి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. సత్తుపల్లి రిజర్వుడ్ కావడంతో ఖమ్మంకు మారి రెండువేల తొమ్మిదిలో విజయం సాధించారు. కాని 2014లో ఓడిపోయారు. తదుపరి తుమ్మల టిఆర్ఎస్లోకి మారి ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టారు. తదుపరి పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. 2018లో పాలేరులో ఓటమి చెందారు. తుమ్మల గతంలో ఎన్.టి.ఆర్., చంద్రబాబుల క్యాబినెట్లలో, కెసిఆర్ క్యాబినెట్‌లోను మంత్రిగా ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా ఉన్న ఖమ్మంలో10సార్లు వామపక్షాలు గెలుపొందాయి. 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. పిడిఎఫ్, సిపిఐ కలిసి ఐదుసార్లు, సిపిఎం నాలుగుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ నాలుగుసార్లు టిడిపి ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెలుపొందాయి. 2009లో ఖమ్మం నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ ఐ టిక్కెట్ కోసం ప్రయత్నించిన సత్తుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటుచేసి ఇండిపెండెంటుగా పోటీచేశారు. 2014లో టిఆర్ఎస్ టిక్కెట్‌పై కొత్తగూడెంలో పోటీచేసి గెలుపొందారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం ఒకసారి శాసనసభకు, మరోసారి లోక్ సభకు గెలుపొందారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పనిచేసిన ప్రముఖ నేత నల్లమల గిరిప్రసాద్ ఖమ్మంలో ఒకసారి గెలుపొందారు. ఆయన ఒకసారి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు రెండుసార్లు గెలిచారు. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 1967,72లలో ఖమ్మంలో గెలిచిన మహ్మద్ రజబ్ అలీ, ఆ తర్వాత సుజాతనగర్లో నాలుగుసార్లు గెలిచి జిల్లాలో ఆరుసార్లు గెలుపొందిన నేతగా నమోదయ్యారు. 1957లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తేళ్ళ లక్ష్మీకాంతమ్మ 1978లో హైదరాబాద్ నగరంలో మరోసారి గెలిచారు. ఆమె ఖమ్మం నుంచి మూడుసార్లు లోక్‌సభకు కూడా నెగ్గారు. టిడిపి 1983 నుంచి ఆయా సందర్భాలలో మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చినప్పటికీ స్వయంగా మొదటిసారిగా 2009లో ఖమ్మంలో గెలిచింది. ఆ తర్వాత రెండు ఎన్నికలలో ఓటమి చెందింది. మంచికంటి రామకిషన్రావు సిపిఎం పక్షాన రెండుసార్లు గెలిచారు. ఖమ్మంలో తొమ్మిది సార్లు కమ్మ, ఒకసారి రెడ్డి, రెండుసార్లు బ్రాహ్మణ, మూడుసార్లు ముస్లింలు గెలుపొందారు. ఖమ్మం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఖమ్మం అభివృద్ధికి రూ.కోట్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో రోడ్లనుసీసీ రోడ్లుగా మార్చి సుందర నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 41, 41వ డివిజన్లలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేయర్ పాపాలాల్‌తో కలిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నగరంలో రోడ్లు, సీసీ డ్రెయిన్ల అవసరాన్ని గుర్తించిన మేరకు నేడు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వాటిని వాడుకలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, కొప్పెర సరిత, పాలడుగు పాపారావు, కొప్పెర నరసింహారావు, నాయకులు ఆర్జేసీ కృష్ణ, రుద్రగాని ఉపేందర్, మెంతుల శ్రీశైలం, నిరంజన్‌రెడ్డి, వసంతబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యవర్గం భేటీ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నూతన కార్యవర్గం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, భవాని, శ్రీదేవి, ప్రేమబాయి, రమాదేవి, విమల, ప్రేమిలా, జ్యోతి, కల్పన పాల్గొన్నారు. -
సీన్ మారింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల ఫలితంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలు, నేతలు ఓటమి పాలు కావడంతో కొత్త వారికి అధికార పగ్గాలు అందాయి. అయితే, జిల్లా ప్రజానీకం ఈ ఎన్నికలలో విలక్షణ తీర్పునిచ్చింది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, టీఆర్ఎస్లకు విజయం చేకూర్చిన ఓటర్లు.. సీపీఐ, న్యూడెమోక్రసీలను మాత్రం ఆదరించలేదు. దాదాపు అన్ని పార్టీలకు ఒకటో, రెండో స్థానాలు దక్కగా, ప్రతి పార్టీకి ఏదో ఒక పదవి లభించింది. ఖమ్మం ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అవకాశమిచ్చారు ప్రజలు. మరోవైపు జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానాన్ని మాత్రం టీడీపీలో చేతిలో పెట్టారు. ఈ పదవుల సంగతలా ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోనికి రావడంతో ఆ పార్టీకి కూడా ప్రజలు పట్టం కట్టినట్టయింది. అయితే, ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ మాత్రం జిల్లాలో మాత్రం పూర్తిగా చతికిలబడిపోగా, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీలు కూడా అదే పరిస్థితిలోకి వెళ్లాయి. నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో జిల్లాలో ఆ పార్టీ తరఫున గెలుపొందిన వారు, కేడర్ అయోమయానికి గురవుతున్నారు. ఇక, పోటీచేసిన తొలి సార్వత్రిక ఎన్నికలలోనే ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం విజయాన్ని ఆస్వాదిస్తూ నూతనోత్సాహంతో ఉన్నాయి. శీనన్న నాయకత్వంలో జిల్లా అభివృద్ధి... ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనున్నారు. తెలంగాణలో ఆ పార్టీ తరఫున ఒకే ఎంపీకి ప్రాతినిధ్యం రావడంతో ఆయన ముఖ్య భూమికే పోషిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు జిల్లాలో ఆయనకు మద్దతుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ తరఫున గెలుపొందారు. వీరి సహకారంతో పాటు ఇతర పార్టీల సూచనలతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఈ ఐదేళ్ల పాటు శీనన్న పెద్దన్న పాత్ర పోషించబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ఆ పార్టీ కేడర్ కూడా సంస్థాగతంగా బలపడేందుకు ఈ ఫలితాలు సహకరిస్తాయని అంటున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేడర్ ఉన్న వైఎస్సార్సీపీ భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. మంత్రి పదవి వస్తుందా..? మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వైపు జిల్లా ప్రజలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. జిల్లా నుంచి ఒకే ఎమ్మెల్యే గెలవడంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి పదవి లభిస్తే జలగం వెంకట్రావు కూడా జిల్లాలో కీలకం కానున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికలలో పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు తమకు కేసీఆర్ ఎలాంటి అవకాశం ఇస్తారోనని ఆశగా చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాకు తగిన ప్రాధాన్యం ఇస్తారని, ఒకరిద్దరికి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ పరంగా చూస్తే బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ జిల్లాలో పట్టు నిలుపుకోవాలంటే ఖమ్మం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధతో కేసీఆర్ పనిచేయాల్సి ఉంటుందని కేడర్ అభిప్రాయపడుతోంది. గెలిచాం... కానీ.. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినందుకు సంతోషించాలో, తెలంగాణ ఇచ్చినా అధికారం దక్కనందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ తరఫున గెలిచిన వారితో పాటు ఇతర నాయకులు కూడా గందరగోళంలో ఉన్నారు. ప్రస్తుతం వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నాయకులు కూడా తమ పదవీకాలం ఎప్పటికి పూర్తవుతుందో అని లెక్కలు క ట్టుకుంటున్నారు. పార్టీలోని వర్గ విభేదాలకు తోడు అధికారం కూడా చేజారడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆలోచనలో ఆ పార్టీ నాయకులున్నారు. తెలుగు తమ్ముళ్ల నిర్వేదం... ఇక, జిల్లాలో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ ఎన్నికల తర్వాత పూర్తిగా చతికిలబడిపోయింది. జిల్లాలో కీలకంగా ఉన్న ఇద్దరు నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఓడిపోవడం, జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు పూర్తి నిర్వేదంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, జిల్లాలో పార్టీ పూర్తిగా ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందులో భాగంగానే పార్టీ నేతలు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటూ కొట్టుకునేంతవరకు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఐదేళ్లు తమ పరిస్థితేంటనేది ఆ పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు.