తెలంగాణ ఉద్యమంలో గులాబీ జెండాను హత్తుకున్న పల్లెలిప్పుడు అదే పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశాయి. తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద అసంతృప్తిని ఓట్ల రూపంలో బయటపెట్టాయి. ఆఖరుకు సీఎం కేసీఆర్ పోటీ చేసినా ఆదరించలేదు. దీంతో కామారెడ్డితో పాటు పొరుగునే ఉన్న ఎల్లారెడ్డి నియోజక వర్గం, ఆ పక్కనే ఉన్న జుక్కల్‌లోనూ బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పలేదు. వరుసగా గెలిపించిన ప్రజలు ఈసారి వద్దనుకుని సాగనంపారు.
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో 2001 లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో చైతన్యవంతమైన సమాజం గులాబీ జెండాను చేతబట్టి ఉద్యమంలో ముందుండి నడిచింది. టీఆర్‌ఎస్ స్థాపించిన తొలినాళ్లలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డిలో ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకుంది. అలాగే ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరడంలో కీలకభూమిక పోషించింది ఈ రెండు నియోజకవర్గాలే.. 2004 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కామారెడ్డి నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీని ఇక్కడి ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపించారు. తెలంగాణ సాధన కోసమే ఎన్నికల్లో విజయతీరాలకు తీసుకువెళ్లారు. 2008 లో ఎమ్మెల్యేల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డిని ఓడించినా ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయననే గెలిపించారు.
తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అయితే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చెప్పగానే ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమవడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో మరోసారి ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు రావడం, ఉద్యమకారులు ఆత్మబలిదానాలకు పాల్పడడంతో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఉప ఎన్నికలలో బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలవగా.. ఓటర్లు వారినే తిరిగి ఎన్నుకున్నారు. తరువాత ఉద్యమం తీవ్రమై సబ్బండ వర్ణాలు భాగమయ్యాయి. రైల్‌రోకో, హైవేల దిగ్బంధం వంటి కార్యక్రమాలు, సకల జనుల సమ్మెల్లో జిల్లా ప్రజలంతా పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 2014 జూన్ 2న నూతన రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంతో జిలా ప్రజలంతా సంతోషించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలు..ఈసారి మూడుచోట్ల ఓటమి
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ విఫలమైందన్న భావన బలపడుతూ వచ్చింది. దీంతో గులాబీ కోట బీటలు వారింది. సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచినా.. ప్రజలు ఆయననూ తిరస్కరించారు. అలాగే ఎల్లారెడ్డిలో బరిలో నిలిచిన జాజాల సురేందర్‌రెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హన్మంత్ సింధేలనూ ఓడించారు. బాన్సువాడ నియోజకవర్గంనుంచి పోటీ చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే గెలుపొందారు. కేసీఆర్ ఉద్యమం తొలినాళ్లలో కామారెడ్డి నియోజక వర్గంలో బ్రిగేడియర్‌గా పనిచేశారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలు ఆయనకు తెలుసు. కేసీఆర్ అంటే అభిమానించేవాళ్లు ఇక్కడ వేలాది మంది ఉంటారు. అలాంటిది కేసీఆర్ పోటీ చేసినా ఓడిపోవడం ఉద్యమకారులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ ఓటమితో శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో జనం జిల్లాలో గులాబీ పార్టీకి సలాం కొట్టారు. కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ నుంచి హన్మంత్ సింధేలను గెలిపించారు. 2018 ఎన్నికల్లో కూడా కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల నుంచి తిరిగి గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హన్మంత్ సింధేలనే అసెంబ్లీకి పంపించారు. ఎల్లారెడ్డిలో వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఏనుగు రవీందర్‌రెడ్డిని మాత్రం ఓడించి, మరో ఉద్యమ నాయకుడైన కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్‌ను గెలిపించారు. కొద్దిరోజుల్లోనే ఆయన కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment