అయిజలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ నాయకుడు విజేయుడు, కొర్విపాడులో మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీఎం అబ్రహం
మహబూబ్‌నగర్: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగానే శాసనసభ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. పలు నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెల్లుబికినా.. అధిక మొత్తంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించింది. ఆయా అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. నాటకీయ పరిణామాల క్రమంలో అలంపూర్‌ను పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.
అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. అసమ్మతి జ్వాల ఎగిసిపడడంతో బీఫాం ఇవ్వకుండా వాయిదా వేశారు. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం మొదలై మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా అలంపూర్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ పదునైన ఆలోచన, పకడ్బందీ ప్రణాళికతో నిక్కచ్చిగా తన నిర్ణయాలను అమలుపరిచే కేసీఆర్.. ఈ సెగ్మెంట్‌లో చివరి వరకు ఉత్కంఠ రేపుతూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ముందే పసిగట్ట లేకపోయారా..
బీఆర్‌ఎస్‌లో ఇది వరకే మాజీ ఎంపీ మందా జగన్నాథం, అబ్రహం మధ్య విభేదాలు ఉండగా.. చల్లా రాకతో ముచ్చటగా మూడు వర్గాలయ్యాయి. ఆధిపత్య పోరులో అబ్రహంపై చల్లా పైచేయి సాధించారు. అబ్రహంకు టికెట్ ఖరారు చేసిన క్రమంలో చల్లా వర్గీయులు పెద్ద ఎత్తున అసంతృప్తి రాజుకోవడంతో అబ్రహంకు బీఫాం ఇవ్వకుండా ఆపిన కేసీఆర్.. నియోజకవర్గ పరిస్థితిపై పూర్తి స్థాయిలో ఆరాతీశారు.
ఈ సందర్భంగా మీరంతా ఏం చేస్తున్నారంటూ ముఖ్య నేతలకు చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఎందు కు ముందుగా పసిగట్టలేక పోయారని ప్రశ్నించడంతో పాటు సీరియస్‌గానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
ఎవరి పట్టు వారిదే..
అలంపూర్‌కు సంబంధించి అబ్రహంతోపాటు ఎమ్మెల్సీ చల్లా, మాజీ ఎంపీ మందాతో చర్చించాకే సమష్టి నిర్ణయంతో అసమ్మతిని చల్లార్చి ముందుకు సాగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ పక్షం క్రితమే సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు వారు పలుమార్లు ముగ్గురు నేతలతో చర్చించినా.. ఎవరికివారు పట్టు వీడకపోవడంతో క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
ఇదేక్రమంలో ఆది నుంచి పార్టీ అభివృద్ధి కోసం కష్టపడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటులో ఆంధ్రా నాయకులతో యుద్ధమే చేశానని..తన కుమారుడు మందా శ్రీనాథ్‌కే టికెట్ ఇవ్వాలని మందా జగన్నాథం పట్టుబడుతుండడం మరింత జఠిలమైనట్లు తెలుస్తోంది.
గులాబీ శ్రేణుల్లో అయోమయం..
సీఎం కేసీఆర్ టికెట్ తనకే ఇస్తారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం ప్రారంభించగా, ఆయనకు దీటుగా ఎమ్మెల్సీ చల్లా తన అనుచరుడైన విజయుడిని సైతం రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టారు. మరోవైపు బెట్టు వీడని మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథంతో పాటు కొత్తగా రిటైర్డ్ ఎంఈఓ మేరమ్మ, అలంపూర్ మున్సిపల్ చైర్మన్ మనోరమ పేర్లు తెరపైకి రావడం గులాబీశ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.
అలంపూర్ నేతలు ముగ్గురితో వేర్వేరుగా జరిపిన చర్చలో వారు వెల్లడించిన అంశాలను ఇరువురు నేతలు ముఖ్యమంత్రికి చేరవేయగా.. అబ్రహంతో పాటు ఎమ్మెల్సీ చల్లా ప్రతిపాదించిన అభ్యర్థి విజయుడిపై ఆయన ఇటీవల ప్రత్యేకంగా సర్వే చేయించినట్లు సమాచారం. ఈ సర్వే ఫలితాలు అబ్రహంకే అనుకూలంగా వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో తదితర పరిణామాలు బేరీజు వేసిన కేసీఆర్ తుది నిర్ణయానికి వచ్చారు.
ఈ మేరకు కేటీఆర్‌కు సరైన అభ్యర్థి పేరును సూచించడంతో పాటు ఆ ముగ్గురి మధ్య సయోధ్య కుదుర్చాలని చెప్పినట్లు తెలిసింది. ఈనెల 19న అలంపూర్‌లోనే సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో ఈలోపే ఫైనల్ చేసిన అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఏ క్షణంలోనైనా బీఆర్‌ఎస్ అభ్యర్థికి పార్టీ బీఫారం అందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment