జడ్చర్ల టౌన్: ఏ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో అయినా పోలింగ్ బూత్‌కు వెళ్లడం.. ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డు చూపడం.. ఓటు వేయడం అంతే. కానీ, ఓటు వేయడంలోనూ చాలెంజ్, టెండరు ఓటు అనేవి ఉంటాయి. చాలెంజ్ ఓటు అంటే.. ఎవరైనా ఓటరు తన ఓటును ముందే వేశారని గుర్తిస్తే అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ టెండరు ఓటుకు అవకాశం కల్పించింది.
చాలెంజ్ ఓటు
పోలింగ్ కేంద్రంలో అధికారులతో పాటు ఆయా పార్టీలు నియమించుకున్న పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక ఓటరు ఓటు వేయటానికి వచ్చినపుడు సదరు ఓటరు నకిలీ అని ఏజెంట్ సందేహించినపుడు పోలింగ్ ఏజెంట్ చాలెంజ్ చేయటానికి వీలు కల్పించారు. ఓటరు సరైన వ్యక్తి కాదని ప్రిసైడింగ్ అధికారితో చాలెంజ్ చేసి రూ.5 రుసుం చెల్లించి సదరు ఓటును చాలెంజ్ చేస్తాడు.
దాంతో ప్రిసైడింగ్ అధికారి ఓటరుకు సంబంధించిన పత్రాలు అన్ని పరిశీలించి నిర్ధారణ చేసుకుని సరైన ఓటరుగా నిరూపణ అయితే ఓటు వేయటానికి అవకాశం కల్పిస్తాడు. లేదంటే వెనక్కి పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో ఓటరుకు బ్యాలెట్ అందించి దానిద్వారా ఓటు వేయించి కవర్‌లో ఉంచి సీల్ చేస్తారు. ఓటరు సక్రమం అని తేలితే కౌంటింగ్ సమయంలో కవర్ ఓపెన్ చేసి దానిని లెక్కించటం జరుగుతుంది.
టెండరు ఓటు
పోలింగ్ రోజున ఓటరు తన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటికి అప్పటికే మరెవరో తన ఓటు వేశారని గుర్తిస్తే టెండరు ఓటు వేస్తానని అధికారులను కోరవచ్చు. తన స్థానంలో ఇంకెవరో ఓటు వేశారని ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. అప్పుడు ఆ అధికారి విచారణ జరిపి గుర్తింపును నిర్ధారిస్తారు. అయినప్పటికి ఓటు వేయటానికి అవకాశం కల్పించకుండా ఉంటే టెండరు ఓటు వేస్తానని ఓటరు డిమాండ్ చేయవచ్చు.
రూ.2 రుసుము చెల్లించి టెండరు ఓటు వేసుకోవచ్చు. టెండరు ఓటు సైతం బ్యాలెట్ ద్వారానే వేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు వేసిన టెండరు ఓటును సీల్డ్ కవర్‌లో ఉంచుతారు. ఇలా చాలెంజ్, టెండరు ఓట్లను ఓటరు వినియోగించుచుకునే వెసులుబాటు ఎన్నికల కమిషన్ కల్పించింది. కాగా ఎన్నికల్లో చాలెంజ్, టెండరు ఓట్లు వినియోగించుకున్న సందర్భాలు మన ప్రాంతంలో లేవనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment