‘‘ఆర్టీసీ బస్సులకూ..ఎన్నికలకూ ఎంతో సంబంధముంది. మరీ ముఖ్యంగా బస్సుల్లో రాసి ఉండే సూక్తులు, ఉపదేశాలతో’’ ఓ పెద్ద బాంబునే పేల్చాడు మా రాంబాబుగాడు. ‘‘మా మానాన మేము మాడిపోయిన మసాలా దోశె తింటుంటే..నువ్వొచ్చి ఎలక్షన్లకూ, బస్సులకూ ముడిపెడతావా? అలాంటి సంబంధాలకు ఆస్కారమే లేని చోట నువ్వు సృష్టిస్తున్న ఈ రా.కీ.వాహన సంబంధాలేమిటి? ఈ సంగతేమిటో నాకిప్పుడే తెలియాలి. తెలిసితీరాలి’’ అంటూ కోప్పడ్డాడు మా బావ. అప్పుడు మా రాంబాబుగాడు చెప్పిన ఉదంతాలూ, ఉదాహరణలు అపూర్వం, అనిర్వచనీయం, అవిస్మరణీయం.
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం..వాళ్ల సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం.
బస్సుల్లో మహిళలుగానీ..ఎన్నికల్లో మహిళలంటే ఇక్కడ జెండర్‌గా తీసుకోకూడదు. స్త్రీలంటేనే చాలా స్పెషల్. అలాంటివారే కీలకమైన కొందరు అభ్యర్థులు కూడా. దేవతల్లో అమ్మవారి లాంటివారే..రాజకీయాల్లో ఈ అయ్యవార్లు!
ప్రస్తుతానికి వాళ్లు మన పార్టీలో లేరు. పక్క పార్టీ నుంచి... ఆల్ ద వే..పార్టీ మారి మరీ రావాలి. అందుకే..ఎన్ని జాబితాలు వెలువడ్డా..ఆయనొచ్చేవరకూ ఆ సీటును మాత్రం ఖాళీగా ఉంచాల్సిందే. ఉదాహరణకు ఓ అభ్యర్థి పేరు రాజగోపాల్‌రెడ్డి, ఆ స్థానం పేరు మునుగోడు. ఇది ఆయనొక్కడికే కాదు..చాలామందికి వర్తిస్తుంది. దాదాపు అన్ని పార్టీలూ అలా ఖాళీల్ని ఉంచి, అభ్యర్థుల రాక కోసం వెయిట్ చేసేవే, చేస్తున్నవే.
ఫుట్‌బోర్డు మీద ప్రయాణం ప్రమాదకరం...
కొందరు నేతలుంటారు. దశాబ్దాలపాటు పార్టీకి సేవలందిస్తారు. జీవితమంతా పార్టీకే ధారబోస్తారు. కీలకమైన ప్రభుత్వ, పార్టీ పదవులు చేపట్టి ఉంటారు. పాపం... తీరా ఎలక్షన్ టైముకు టికెట్ రాదు. కొందరు రాజీనామా చేస్తారు. మరికొందరు చెయ్యరు.
ఇక వీళ్లంతా సీటు దొరకని ప్రయాణికుల్లా ఉంటారు. సీటు దొరకనందుకు అసహనంగా ఉంటారు. ఫుట్‌బోర్డు మీద ప్రయాణికుల్లా కనిపిస్తారు. అప్పుడు పొరుగు పార్టీ అధినేతనో లేదా మరో పార్టీలోని పెద్ద నేతనో కండక్టర్‌లా వస్తాడు. లోనికి రమ్మంటాడు. ఫుట్‌బోర్డు మీద నుంచి బస్సులోకి తీసుకెళ్లినట్టుగా..తమ పార్టీలోకి పట్టుకుపోతాడు. ఒక్కటే తేడా. కండక్టర్ హార్ష్‌గా తిట్టి తీసుకుపోతాడూ... కీలకనేతల్ని గౌరవం నటిస్తూ పట్టుకుపోతారు. డిఫరెన్స్ ఇంతే. ఉదాహరణకు పొన్నాల లక్ష్మయ్య గానీ ఇలాంటివారు ఎందరో నేతలూ!...ఎన్నో పార్టీలూ!!
ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం
ఈ నినాదం ఎలక్షన్స్‌కు ఎలా వర్తిస్తుందో చూద్దాం. దీనర్థం ఏమిటంటే..మా పార్టీలోనే మీకు తగిన ప్రాధాన్యముంటుంది. ప్రైవేటు బస్సుల్లాంటి ఇతర పార్టీల్లో మీకంత ప్రయారిటీ ఉండకపోవచ్చు అని సూచించేలాంటిదే ఈ నినాదం.
‘‘అన్నీ నాయకులకేనా, సామాన్యులకేమీ సందేశాలు లేవా?’’ అడిగాడు మా బావ. ‘‘ఎందుకు లేవూ... ‘లైట్లు ఆర్పి సెల్ఫ్ కొట్టవలెను’ అని కూడా రాసి ఉంటుంది. ఇది డ్రైవరుకు సంబంధించిన సూచన. ఓటర్లంతా మామూలు ప్రయాణికుల్లాంటివారు. వాళ్లంతా బస్సెక్కాక..అంటే ఓటేశాక..తమ దారి స్పష్టంగా ఉండటం కోసం డ్రైవర్లలాంటి నేతలంతా బస్సులో దీపాలార్పేసి జనాల బతుకులు చీకటి చేస్తారు.
ఇది నేతలకు ఓ సూక్తి!..జనాలకో హెచ్చరిక!!
Comments
Please login to add a commentAdd a comment