పరకాల నియోజకవర్గం
పరకాల నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన చల్లా దర్మారెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో ధర్మారెడ్డి టిడిపి తరపున గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018లో టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి కొండా సురేఖపై 46519 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. 2014 ఎన్నికలలో వరంగల్ తూర్పు నుంచి టిఆర్‌ఎస్ తరపున గెలిచిన కొండా సురేఖ 2018 ఎన్నికల ముందు పార్టీ నాయకత్వంపై అలిగి పార్టీని వీడి కాంగ్రెస్ ఐలో చేరి పరకాల నుంచి పోటీచేశారు.
అయినా ఫలితం దక్కలేదు. దర్మారెడ్డికి 105903 ఓట్లు రాగా, కొండా సురేఖకు 59384 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన యు.శ్రీనివాస్‌కు సుమారు నాలుగువేల ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో చల్లా దర్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి టిఆర్‌ఎస్ నేత సహోదర రెడ్డిపై 9108 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఇ. వెంకట్రామిరెడ్డికి 30283 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత దర్మారెడ్డి టిఆర్‌ఎస్ లో చేరిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనలో సొంత నియోజకవర్గం అయిన శాయంపేట రద్దు కావడంతో 2009లో కొండా సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించారు.
అంతేకాక డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవిని కూడా పొందగలిగారు. వైఎస్ మరణం తర్వాత కొండాసురేఖ కొంతకాలం రోశయ్య క్యాబినెట్‌లో కొనసాగి రాజీనామా చేశారు. కొండా సురేఖ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లో ముఖ్యనేతగా కొనసాగి, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురి అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో 1562 ఓట్ల తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్ధి బిక్షమయ్య చేతిలో సురేఖ ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలలో వై.ఎస్.ఆర్.
కాంగ్రెస్ సమైక్యవాదానికి అనుకూలంగా మొగ్గు చూపుతోందని విమర్శిస్తూ, సురేఖ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరిగి కాంగ్రెస్ ఐలో చేరారు. తదుపరి ఆమె టిఆర్‌ఎస్‌లో చేరి 2014 లో వరంగల్ తూర్పులో గెలుపొందారు. 2018 ఎన్నికల సమయానికి తిరిగి కాంగ్రెస్ ఐలో చేరి ఓటమి చెందారు. కొండా సురేఖ భర్త మురళి కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. పరకాల నియోజకవర్గం నుంచి 1952 నుంచి 1972 వరకు జనరల్‌గాను, ఆ తర్వాత 2004 వరకు రిజర్వుడుగాను, 2009 నుంచి మళ్ళీ జనరల్‌గా మారింది.
పరకాలలో పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఆరుసార్లు, భారతీ యజనసంఫ్‌ు, భారతీయ జనతాపార్టీ కలిసి మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ ఒకసారి, టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచాయి. బిజెపి సీనియర్ నాయకుడు సి. జంగారెడ్డి ఇక్కడ ఒకసారి, శాయంపేటలో రెండుసార్లు గెలుపొందారు. ఆయన హన్మకొండ లోక్‌సభ స్థానంలో మాజీప్రధాని పి.వి నరసింహారావును ఓడిరచి చరిత్ర సృష్టించారు. ఆర్. నరసింహరామయ్య ఇక్కడ ఒకసారి హసన్‌పర్తిలో రెండుసార్లు గెలిచారు.
రెండుసార్లు గెలిచిన బచ్చు సమ్మయ్య ఒకసారి, హసన్‌పర్తిలో మరోసారి గెలిచారు. బిజెపి అభ్యర్ధి అయిన జయపాల్ ఇక్కడ రెండుసార్లు, బి. రాజయ్య ఇక్కడ ఒకసారి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మరోసారి గెలిచారు. 2004లో టిఆర్‌ఎస్ పక్షాన గెలిచిన శారారాణి ఆ తర్వాత అసమ్మతిలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ విఫ్‌కు విరుద్ధంగా కాసాని జ్ఞానేశ్వర్ మద్దతు ఇచ్చినందుకుగాను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈమెను అనర్హురాలిని చేస్తూ అప్పటి స్పీకర్ సురేష్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
మొత్తం తొమ్మిదిమంది ఈ విధంగా అనర్హతకు గురి అయితే వారిలో ఈమె ఒకరు. అయితే ఈమె తీర్పు రావడానికి ఒకరోజు ముందే పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నుంచి గెలిచిన సమ్మయ్య గతంలో భవనం, కోట్ల మంత్రి వర్గాలలో ఉంటే, సి. ధర్మారెడ్డి అప్పట్లో జలగం క్యాబినెట్‌లో ఉన్నారు.పరకాలలో ఐదుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, తొమ్మిదిసార్లు ఎస్.సిలు, ఒకసారి ఇతరులు గెలిచారు.
పరకాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment