సాక్షి, కామారెడ్డి: మంజీర నది తీరాన ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేయడలో ముగ్గురూ ముగ్గురే అన్నట్టుగా ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముగ్గురు అభ్యర్థులు రాజకీయంగా అనుభవం ఉన్నవారు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు. ఆయన మంత్రిగానూ పలుమార్లు పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి మూడు పర్యాయాలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు.
బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఒక పర్యాయం ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో మున్నూరు కాపులు, ఆంధ్ర సెటిలర్లు, మైనారిటీలు, ముదిరాజ్‌లు ఎక్కువగా ఉంటారు. ఎవరి ఓట్లు ఎటు వెళ్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ప్రభావం చూపే అంశాలన్నీ బాన్సువాడ నియోజకవర్గంలో కనిపిస్తాయి. బాన్సువాడ నియోజకవర్గం రెండు జిల్లాల్లో కలగలిసి ఉంటుంది. బాన్సువాడ పట్టణం, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలు కామారెడ్డి జిల్లాలో ఉండగా, కోటగిరి, వర్ని, రుద్రూర్, చందూర్, పొతంగల్, మోస్రా మండలాలు నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వస్తాయి.
వరుస విజయాలతో..
ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వరుస విజయాలతో ఊపు మీదున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఐదేళ్లలో మంత్రిగా, తర్వాత అసెంబ్లీ స్పీకర్‌గా నియోజకవర్గంలో అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చారు. బాన్సువాడను మున్సిపాలిటీని చేసి, పురపాలక శాఖ ద్వారా భారీ ఎత్తు నిధులను రాబట్టి అభివృద్ధి చేశారు. పట్టణంలో మౌలిక వసతులు కల్పించారు. సాగునీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిచ్చారు. సిద్దాపూర్, జకోరా వంటి ఎత్తిపోతల పథకాలు పురోగతిలో ఉన్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే ముందువరుసలో నిలిచారు. పదకొండు వేలకు పైగా ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారు. తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు.
ఇసుక దోపిడీపై ఆరోపణలు
బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నీతివంతమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంజీర ఇసుక దోపిడీపై ఆయన ఆరోపణలు చేస్తున్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలకు అంతా తెలుసని, ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకంతో ఉన్నారు. స్థానికంగా హిందుత్వ నినాదంతో పనిచేసిన వారంతా ఆయనకు సహకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment